
కొండపిలో కూటమి అక్రమాలు
ఒంగోలు సిటీ: కొండపి సర్పంచ్ ఎన్నికల్లో కూటమి నేతలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. బుధవారం ఆయన ఒంగోలు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని మంత్రి, నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల దరఖాస్తులను ఫోర్జరీ సంతకాలతో ఎన్నికల అధికారికి సమర్పించి ఉపసంహరణల కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను సైతం లొంగదీసుకుని ఈ అక్రమాలకు తెగబడ్డారని ఆయన ధ్వజమెత్తారు. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ముగ్గురు మహిళలు ముందుకు వచ్చారని, నామినేషన్ వేయకుండా వారిపై రకరకాలుగా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. వై కళ్యాణి, ఏ విమలమ్మ, పల్లె మేరి నామినేషన్లు వేశారని, నామినేషన్ల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కళ్యాణి భర్త వసంతరావు పోలీస్ డిపార్టుమెంట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని, ఆయన్ను సైతం భయాందోళనకు గురిచేసి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ, కనిగిరి డీఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే కళ్యాణిని ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఆమే స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని, వాటిని పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిందని డీఎస్పీ మాట్లాడడం సరికాదని ధ్వజమెత్తారు. ఉపసంహరణ పత్రాలు ఎన్నికల అధికారికి ఇస్తారు కానీ పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అధికారపార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి ఊరు విడిచి ఎక్కడో తలదాచుకున్న విమలమ్మ వద్దకు వెళ్లి టెర్రరిస్టులను వేటాడినట్టుగా వేటాడి వారి వద్ద నుంచి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. సమయం ముగిసినా కూడా ఎన్నికల అధికారి విమలమ్మ లేకుండా ఆమె పత్రాలను తీసుకుని ఉపసంహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇక పల్లెమేరి ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమయ్యారని, నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని కోరిందని, తాము వెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించేలా చేశారని ఆరోపించారు. తాను పోటీలో ఉన్నానని చెబుతున్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కొండపిలో జరిగిన అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కొండపిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. 4వ తేదీ రాత్రి నుంచి అధికార కూటమి నేతల అరాచకాలు ప్రారంభమయ్యాయన్నారు. ఉపసంహరణల సమయం గంట ముందు వరకూ తనతో ఫోన్లో మాట్లాడిన ఎన్నికల అధికారి తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారంటే ఆయన పై మంత్రి, నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో అర్థమవుతోందన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెగబడడం, ఓటర్లను, పోటీలో ఉండే అభ్యర్థులను కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. మాకు ప్రత్యర్థి అధికార కూటమా? అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులా? అన్న సందేహం కలుగుతోందన్నారు.
నామినేషన్లు వేసిన నాటి నుంచి వేధింపులు..
సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని పల్లె మేరి ఆరోపించారు. వారి చర్యలకు భయపడి ఊరు వదిలి వందల కిలోమీటర్లు దూరం వెళ్లి తలదాచుకున్నామని, తన భర్తను, పిల్లల్ని రకరకాలుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. పోలీసులు, నాయకులు అందరూ టార్గెట్ చేశారని, అయినా తాను భయపడలేదని, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలు అధికారులకు ఇచ్చారని ఆరోపించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అధికారులు న్యాయం చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వ బెదిరింపులు దారుణం:
ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగకుండా కూటమి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడం దారుణమన్నారు. ఇటువంటి నియంతృత్వ విధానాలకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. కార్యక్రమంలో యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ మారెడ్డి వెంకటాద్రిరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి, జిల్లా అంగన్‌వాడీ అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, పల్లె శివరావు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారెంరెడ్డి గంగాధరరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వీరవసంతరావు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ ఎన్నికలు జరగకుండా కుట్రలు వైఎస్సార్ సీపీ నాయకులపై బెదిరింపులు అధికారులపై మంత్రి, నాయకుల ఒత్తిళ్లు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అభ్యర్థులను బెదిరించారు ఎన్నికలు నిర్వహించే వరకూ పోరాడతాం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్