
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
మార్కాపురం/తర్లుపాడు: పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల సమయంలో ఓటమి భయంతో కూటమి నాయకులు బరితెగించి బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రాముతోపాటు పలువురిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ నాయకులపై దాడి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తోందని అన్నారు. ప్రజలకు ఏం చేయాలి.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. అనే అంశాన్ని మరచి రెడ్‌బుక్ పాలన నడిపిస్తున్నారని విమర్శిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడికి దిగడం దారుణమన్నారు. ఒక ఎమ్మెల్సీకి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా అని ప్రశ్నించారు. పులివెందులలో శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మా రాజేంద్రప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీసీ నేత, పులివెందుల శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్‌పై మంగళవారం టీడీపీ గూండాలు చేసిన దాడిని ఆయన ఓ ప్రకటనలో ఖండించారు. ఇది బీసీలపై చేసిన దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దాడి చేసిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడిని ఖండించిన జంకె