
రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మాయం
● పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
ముండ్లమూరు(దర్శి): మండలంలోని శంఖరాపురం గ్రామానికి చెందిన 1బీ రికార్డు మాయమైంది. దీంతో ఆరుగురు రెవెన్యూ అధికారులపై మండ్లమూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..శంఖరాపురం గ్రామానికి చెందిన మేడికొండ వెంకటకృష్ణారావుకు, అదే గ్రామంలో మరొకరికి పొలం వివాదం ఉంది. 1బీ మాన్యువల్ రికార్డు చూసి న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను ప్రాధేయపడినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో కృష్ణారావు హైకోర్టులో కేసు వేశారు. ఈ రికార్డు అటు శంఖరాపురంలో వీఆర్వో వద్ద కానీ, ఇటు తహసీల్దార్ కార్యాలయంలో గానీ లేదు. దీంతో రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగానే మాయంచేసి ఉంటారని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. 1బీ రికార్డు మాయం వెనుక ఎవరెవరి పాత్ర ఉందో గుర్తించటంతో పాటు 2018 నుంచి 2022 వరకు పనిచేసిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ స్థానిక తహశీల్దార్ లక్ష్మీనారాయణను అప్పడు పనిచేసిన అధికారులపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పటి తహసీల్దార్లు జి.నాంచారయ్య, పాలపర్తి పార్వతి, అప్పటి డీటీ కె.రవికుమార్, ప్రస్తుత డీటీ అద్దంకి స్రవంతి, అప్పటి సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి శంఖరాపురం వీఆర్వో నంబూరి గురవయ్యలను అనుమానితులుగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కమలాకర్ తెలిపారు.
ఆర్‌ఐఓగా ఆంజనేయులు బాధ్యతల స్వీకరణ
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకాశం జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారిగా ఇంటర్ విద్య అధికారిగా వ్యవహరిస్తున్న తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్‌ఐఓగా పనిచేస్తున్న ఏ సైమన్‌విక్టర్ ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారిగా నియామకం పొందడంతో ఆ బాధ్యతలను కూడా డీఐఈఓ ఆంజనేయులకు అప్పగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంజనేయులు ఆర్‌ఐఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు.