
పారిశుధ్య కార్మికులకు రాజకీయ వేధింపులు
● మస్టర్ పాయింట్ల వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మస్టర్ పాయింట్ల వద్ద కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న వారిని వివిధ రాజకీయ కారణాలతో విధుల నుంచి తప్పించారన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, 60 ఏళ్లు నిండిన వారికి జీఓ నంబర్–25 ప్రకారం ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కార్మికులపై పర్యవేక్షణ పేరుతో పని జరగట్లేదని వివిధ కారణాలతో కార్మికుల్ని మస్టర్ ఆపేయటం, విధుల నుంచి తొలగించి మీ ఉద్యోగం తీసేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కార్మికులకు పీఎఫ్ గానీ, ఈఎస్‌ఐ కార్డులు గానీ పరిపూర్ణంగా అమలు చేయలేదన్నారు. చనిపోయిన కార్మికులకి పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ క్లైమ్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్మికులు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కూడా కార్మికులకి అందలేదన్నారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.నరసింహ, టి.విజయమ్మ, నాయకులు యు.రత్నకుమారి, మోహన్, రాములు, ఎద్దురవి, ఎం .బాబు, ఆర్ శ్రీనివాసరావు, పి సుబ్బారావు, ఆనంద్, కె. వెంకటేశ్వర్లు, ఎం లక్ష్మీకాంతం, నాగలక్ష్మి, కే వంశీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.