
వెట్టిచాకిరీ నుంచి 40 మందికి విముక్తి
● ఒడిశా, చత్తీస్‌గఢ్‌వాసులకు రిలీఫ్ సర్టిఫికెట్లు ఇచ్చి స్వగ్రామాలకు..
ఒంగోలు సబర్బన్: టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 40 మంది ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్ర వాసులకు జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వారికి రిలీఫ్ సర్టిఫికెట్లు అందించారు. పనిచేసిన కాలానికి చట్ట ప్రకారం వారికి రావాల్సిన నగదును ఇప్పించడంతో పాటు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. వీటికి సంబంధించిన వివరాలను ఒంగోలు ఆర్డీఓ కె.లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఒడిశా నుంచి 17 మంది, చత్తీస్‌గఢ్ నుంచి 23 మంది వచ్చి టంగుటూరు మండలంలోని రెండు రొయ్యల పరిశ్రమలలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ జిల్లా ప్రజలు ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నారని ఛత్తీస్‌గడ్‌లోని బస్తర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ అధికారులు ఈ బాధితులను సోమవారం రక్షించినట్లు తెలిపారు. ఒక మధ్యవర్తి మాయమాటలు చెప్పి ఈ వెట్టి చాకిరీ ఊబిలోకి దించారని, తమకు సరైన వసతిగానీ, ఆహారం గానీ, చేసిన పనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని బాధితులు చెప్పినట్లు ఆర్డీఓ వివరించారు. బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు పరిశ్రమలపై వెట్టిచాకిరీ నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన, కనీస వేతన చట్టాల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి బస్తర్ జిల్లా నుంచి వచ్చిన అధికారులతో వారి స్వస్థలాలకు పంపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎఎస్ పీడీ సువర్ణ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం.కోటేశ్వరరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మేరీ సుజాత, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, డీసీపీఓ దినేష్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్‌కుమార్, శ్యామ్ పాల్గొన్నారు.