
ఆటపాటలతో ప్రభుత్వాలను నిలదీస్తాం
ఒంగోలు టౌన్: ఆట, పాట, మాటలతో ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వాలను నిలదీస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏపీ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ప్రచార బస్సు యాత్రను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ ఒంగోలు నగరంలో తొలిసారిగా సీపీఐ రాష్ట్రమహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పటి నాటి నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఇక్కడి ప్రజల పేరు చెప్పుకొని నాయకులు బాగుపడ్డారే కానీ ప్రజల జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు జీవనాధారమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నేటికి 29 ఏళ్లు గడుస్తున్నా పనులు నత్త నడకన సాగుతున్నాయని చెప్పారు. కనిగిరి ప్రాంతంలో నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక వాడలు కేవలం హామీలుగానే మిగిలిపోయాయయని చెప్పారు. ఈ హామీలు అమలుకాక పోవడంతో జిల్లాలో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ప్రజలకు ఉపాధి లేక వలసబాటలు పడుతున్నారన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాసభలను పురస్కరించుకొని వెయ్యి మంది కళాకారులు, 100 గొంతుకలతో, 100 కళారూపాలతో ప్రజా కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాలకు దర్శకుడు బాబ్జీ, వందేమాతరం శ్రీనివాస్, మాదాల రవి, అజయ్‌ఘోష్, గోరటి వెంకన్న తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ బస్సు ప్రచారయాత్ర ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్, ఆర్.రామకృష్ణ, ఆరేటి రామారావు, ఎస్‌కే నజీర్, పిచ్చయ్య, గుర్రప్ప, అనంతలక్ష్మి, దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.