
పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
● జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు
మద్దిపాడు: పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు రైతులకు సూచించారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆత్మ సౌజన్యంతో మండలంలోని నాగన్నపాలెం గ్రామంలో సోమవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏవో స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరం బర్లీ పొగాకు వలన రైతులు నష్టపోయారని, రాబోయే సంవత్సరం పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు వేసుకోవాలని ఆయన సూచించారు. డీపీఎం సుభాషిని మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎరువులు, పురుగు మందులు వేయకుండా పంట దిగుబడులు పెంచుకోవాలన్నారు. రైతులంతా ఆరోగ్యవంతమైన పంటలు పండించాలని కోరారు. ఆత్మ డీపీడీ విజయనిర్మల మాట్లాడుతూ మట్టి పరీక్ష కార్డుల ఆధారంగా ఎరువులు వేసుకోవాలని తెలిపారు. రైతులంతా తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి స్వర్ణలత మాట్లాడుతూ రైతులంతా పంట వేయనటువంటి నేలను కూడా నమోదు చేయించుకోవాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల డబ్బులు జమ కాని రైతులు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చని తెలిపారు. డీఏవో ఎస్.శ్రీనివాసరావు మినుము వేసే రైతులకు మినుము కిట్లు అందించారు. సర్పంచ్, రైతులకు నవధాన్యాల కిట్లు అందించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.