
శిక్షణ భారం!
ఒత్తిడి పాఠం..
ఒంగోలు సిటీ: పాఠశాలలు ప్రారంభమై రెండో నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తరగతుల్లో బోధనకు బదులుగా వారికి విభిన్నమైన బోధనేతర పనులు అప్పగిస్తుండడంతో విద్యార్థుల భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడుతోంది. పాఠశాలలు జూన్ 12న ప్రారంభమైనప్పటికీ, ఉపాధ్యాయులు అప్పటి నుంచే బదిలీల కౌన్సెలింగ్‌లు, శిక్షణ కార్యక్రమాలు, వివిధ యాజమాన్య సమావేశాలతో తలమునకలయ్యారు. బోధనేతర పనులతో టీచర్లు బిజీగా ఉండడంతో మా పిల్లల చదువు దెబ్బతింటోందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కూళ్లు తెరుచుకున్నా కొనసాగిన బదిలీల కౌన్సెలింగ్..
● జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం, విద్యాశాఖ ముందుచూపు లేకపోవడంతో స్కూళ్ల తలుపులు తెరుచుకున్నా టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ జరుగుతూ వచ్చింది. కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారం జగరడంలేదని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసిన సంగతి విదితమే. బదిలీల తంతు ముగిసింది. బదిలీ అయిన వారు విధుల్లో చేరారు. అప్పటికే వారం పాటు విద్యార్థులకు పాఠాలు దూరమయ్యాయి.
ప్రభుత్వ ప్రచార యావ.. గురువులకు, విద్యార్థులకు శాపం..
జూన్ 21న కూటమి ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శాపంగా మారింది. గిన్నిస్ రికార్డు కోసం కూటమి ప్రభుత్వం నానా హంగామా చేయడంతో ఉపాధ్యాయులు పడరాని పాట్లుపడ్డారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ జిల్లా ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఫలితంగా విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జూలై 10వ తేదీ ఆర్భాటంగా నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాల(మెగా పీటీఎం)కు పదిహేను రోజుల ముందు నుంచే టీచర్లు తగరతి గదులకు దూరమయ్యారు.
ఫ్యాప్టో నేతల ధర్నా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, శిక్షణలతో మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బలవంతపు పీ 4 కార్యక్రమంతో ఉపాధ్యాయులను నిర్బంధానికి గురి చేయరాదన్నారు. బదిలీల ప్రమోషన్లు తీసుకున్నా పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్య పరిష్కరించాలని, అంతర జిల్లాల బదిలీలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబరు 57 ను అమలు చేయాలని, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.