
రైతులు కష్టాలపాలు
ఒంగోలు సబర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మరిన్ని కష్టాలపాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణలతో పాటు మరికొంత మంది నాయకులతో కలిసి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రహ్మానంద రెడ్డి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్, 2024 నుంచే దీన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు. ఈ రెండు సంవత్సరాలకు గాను ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. అంతేకాక 7 లక్షల మందికి ఈ పథకంలో కోత విధించారన్నారు. దీనివల్ల వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పుల మీద ఆధారపడే పరిస్థితిని సృష్టించారన్నారు. ఏరైతుకూ గిట్టుబాటు ధర దొరకడంలేదన్నారు. రైతు తాను పండించిన పంటలను రోడ్డుమీద వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పంటల బీమా రద్దు చేశారని, గత ఏడాది ఇన్సూరెన్సు చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడిందని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశారని మండిపడ్డారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారన్నారు. రైతులకు ఎరువులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. యూరియా దొరక్కపోవడంతో ఎక్కడకు వెళ్లాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా కేటాయింపులకు, సరఫరాకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బస్తాపై బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ చుండూరు రవి బాబు మాట్లాడుతూ రైతాంగం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక రేట్లు పెట్టి ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు కొంటున్నారని అన్నారు. రైతులు ఓవైపు కష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదని మండిపడ్డారు. రైతులకు వెంటనే ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారి లైసెన్సులు రద్దు చేయాలని వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు వేలం కేంద్రాల నుంచి ఒక్కో రైతు 40 నుంచి 50 శాతం బేళ్లు వెనక్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. పొగాకు కిలో రూ.200 తగ్గకుండా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కనిగిరి వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ, పార్టీ జోనల్ రైతు విభాగం అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారు బాబు, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణా రెడ్డి, పార్టీ నాయకులు కాట్రగడ్డ మహేష్ బాబు, పోలవరం శ్రీమన్నారాయణ, మన్నే శ్రీనివాస రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.
రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలి ఎరువుల పంపిణీ, గిట్టుబాటు ధరల్లో ప్రభుత్వం విఫలం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటుపరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి జేసీ గోపాల కృష్ణను కలిసి వినతిపత్రం అందజేత