
కొండపి పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్
కొండపి: కొండపి పంచాయతీ ఎన్నికల్లో పార్టి అధిష్టానం ఆదేశాల ప్రకారం సర్పంచ్‌తో పాటు, అన్ని వార్డుల్లో పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీమంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నాయకులు, కార్యకర్తలతో ఎన్నికలపై ఆయన సమీక్షించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పోటీ విషయమై కూటమి ప్రభుత్వ నాయకులు రాజీకి వచ్చారని 14 వార్డుల్లో 9 టీడీపీకి, 5 వైఎస్సార్‌సీపీ కి కేటాయిస్తామని, సర్పంచ్ అభ్యర్థి టీడీపీకి కేటాయించాలని ప్రతిపాదించారని, కానీ ఈ ఒప్పందానికి తాను ఒప్పుకోలేదని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. అధిష్టానం సూచనలతో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డులకు అభ్యర్థులు బరిలో ఉంటారని ఆయన వివరించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పది రోజులుగా పోస్టింగ్ కోసం ఎదురుచూపులు
బేస్తవారిపేట: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో జేఈ పోస్టింగ్ కోసం పది రోజులుగా ఓ మహిళా అధికారి ఎదురుచూపులు చూస్తోంది. తర్లుపాడు మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో జేఈగా పనిచేస్తున్న సుభద్రాదేవి బేస్తవారిపేట మండల జేఈగా చేరేందుకు ఎమ్మెల్యే లెటర్ తీసుకున్నారు. ఈ మేరకు గతనెల 25వ తేదీ డ్వామా పీడీ బేస్తవారిపేట మండల ఎన్‌ఆర్‌ఈజీఎస్ జేఈగా అపాయిన్‌మెంట్ లెటర్ ఇచ్చారు. అదేరోజు ఎంపీడీఓ కార్యాలయంలో జాయినింగ్ లెటర్ అందజేశారు. రాచర్ల మండలం జేఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావు బేస్తవారిపేటలో ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాడు. ఇతను రిలీవ్ కాకపోవడంతో సుభద్రాదేవి పది రోజుల నుంచి కార్యాలయానికి రావడం, కనీసం సంతకాలు కూడా చేయకుండా వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా నాగేశ్వరరావును బేస్తవారిపేటలో ఉంచాలని, సుభద్రాదేవిని చేర్చుకోవద్దని టీడీపీ నాయకులు ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
12న జాతీయ నులిపురుగుల దినోత్సవం
ఒంగోలు సబర్బన్: నులిపురుగులు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు హాని కలిగిస్తాయని జేసీ ఆర్.గోపాల కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని మీ కోసం కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవంపై కన్వెర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జాతీయ నులిపురుగులు దినోత్సవ పోస్టర్‌ను జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని తెలిపారు. జిల్లాలో 1–19 ఏళ్లలోపు పిల్లలు 5,96,751 మంది ఉన్నారని వారికి 6,08,000 ఆల్బెండజోల్ మాత్రలు అవసరం అవుతాయన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లలు నులిపురుగుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథి మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలకు, ఇతర విద్యా సంస్థలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ కమలశ్రీ,, ఐసీడీఎస్ పీడీ, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.