
అక్రమంగా భూములు ఆన్‌లైన్ చేసుకున్నారు
ఒంగోలు సబర్బన్: పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల భూములను మాజీ సర్పంచ్ భర్త మేకల శంకరరావు అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నాడని తోకపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమాన్ని జేసీ రోణంకి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన తోకపల్లి గ్రామస్తులు జేసీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలోని అనేక సర్వే నంబర్లలోని భూములను మేకల శంకరరావు అధికారులను లోబరుచుకొని అక్రమంగా ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడన్నారు. శంకరరావు పేరుమీద 50కి పైగా భూముల ఆన్‌లైన్ ఖాతా నంబర్లు ఉన్నాయని జేసీకి వివరించారు. అతని వద్ద నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి గ్రామంలోని ఇతరుల భూములను ఆన్‌లైన్ చేయించుకున్నాడని వివరించారు. అతని ఇంట్లో రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, సర్వే అధికారుల స్టాంపులు, లెటర్ ప్యాడ్‌లు అనేకం ఉన్నాయన్నారు. అదేమని అడిగితే చంపుతానంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. గ్రామానికి చెందిన బిట్రా తిరుమలమ్మ (85)కు చెందిన 4 ఎకరాల భూమిని కూడా అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నాడని, ఆమె ఆరు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదని జేసీ దృష్టికి తెచ్చారు.
వంద ఎకరాల పశువుల బీడు కబ్జా..
కనిగిరి మండలం వంగపాడు గ్రామంలోని వంద ఎకరాల పశువుల బీడు కబ్జాకు గురైందని గ్రామానికి చెందిన కాకర్ల శ్రీనివాసులు జేసీకి ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన కాకర్ల సత్యం, కాకర్ల కొండయ్య, కాకర్ల సూర్యంతో పాటు మరికొంతమంది కలిసి పశువుల బీడు భూమిని అన్యాక్రాంతం చేశారన్నారు. దాదాపు 15 సర్వే నంబర్లలోని ఈ భూమి కొంతమంది చేతుల్లోకి వెళ్లటంతో గ్రామంలోని మిగతా రైతులు, పశు పోషకులకు చెందిన పశువులను పొలాల్లోకి వాళ్లు రానీయటం లేదన్నారు. రెవెన్యూ అధికారులు కూడా వాళ్లతో కలిసిపోయారని వివరించారు. కనీసం ఆర్‌టీఐ కింద సమాచారం అడిగినా రెవెన్యూ అధికారులు ఇవ్వటం లేదన్నారు.
1996 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి..
1996 డీఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని అప్పటి డీఎస్సీ అభ్యర్థులు పలువురు మీకోసం కార్యక్రమంలో సింగరాయకొండకు చెందిన రావూరి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అర్జీ సమర్పించారు. 1996 డీఎస్సీలో క్వాలిఫై అయ్యానని, మూడు విడతలుగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారన్నారు. ఎంపికై నా సెలక్షన్ జాబితాలో తన పేరు లేదన్నారు. కొందరు కోర్టుకు వెళ్లారని, తాను ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండి కోర్టుకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 అభ్యర్ధులకు మాత్రం ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎంటీఎస్ మాదిరిగా 1996 అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వేడుకున్నారు.
తోకపల్లి మాజీ సర్పంచ్ గ్రామంలోని పొలాలు అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నాడు కనిగిరి మండలం వంగపాడులో పశువుల బీడు 100 ఎకరాలు కబ్జా మీ కోసంలో జేసీ గోపాలకృష్ణకు ఫిర్యాదు