
అన్నం పెట్టే రైతులకు సున్నం
నిరుపేదల ఉపాధికి గండి..
ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగంలో 70 శాతానికి పైగా పనిచేస్తున్న మహిళలకు తగిన గుర్తింపు దక్కడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చి ఆహార భద్రతకు తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. ఆదివారం ఒంగోలులోని ఐద్వా కార్యాలయంలో జిల్లా మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామీణ నిరుపేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించారని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలను దెబ్బ తీస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించేందుకు మహిళను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కొండపిలో నిర్వహించనున్న ఐద్వా 13వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షర్మిల మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గత మూడేళ్ల కాలంలో చేపట్టిన ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఊసా రాజ్యలక్ష్మి, నెరుసుల మాలతి, ఎ.ఆదిలక్ష్మి, కె.ప్రసన్న, భావన రాజ్యలక్ష్మి, డి.శారా, కె.రాజేశ్వరి, శాంత కుమారి, అనంతలక్ష్మి, టి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగంలో మహిళల శ్రమకు గుర్తింపు లేదు
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి