
ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికపై ప్రమోషన్లు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ కార్యాలయంలో ఫ్యాప్టో, జాక్టో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. మొట్టమొదట పీఆర్టీయూ పక్షాన ఒకే నియామక పరీక్ష ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికై న వారి ఖాళీలను బట్టి వివిధ మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో నియమించారన్నారు. అయినప్పటికీ పాఠశాల విద్యాశాఖ నియంతృత్వ ధోరణితో స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించిందని, వారికంటే సీనియర్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ జూనియర్లను ఎంఈఓలుగా నియమించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని, దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. డైట్ లెక్చరర్లు సీనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ పొందగానే డీఈఓలుగా ఎఫ్‌ఏసీ ఇచ్చారు కానీ డైట్ లెక్చరర్లకు ఈక్వల్ గా ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను మాత్రం డీవైఈఓలుగా, డీఈఓలుగా నియమించకపోవడం చాలా అన్యాయమని, ఈ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. జాక్టో తరఫున శ్రీనివాసరావు, నరహరంజిరెడ్డి, మల్లికార్జున రావు ఫ్యాప్టో తరఫున అబ్దుల్ హై, రఘు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున వై.వెంకట్రావు. సాయి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారుల సంఘం తరఫున కిషోర్ బాబు, నాగేంద్రవదన్ పాల్గొన్నారు.
ఎంఈఓల నియామకాల్లో సీనియర్లను పక్కనబెట్టడం సరికాదు
విద్యాశాఖ తప్పు సరిదిద్దుకోకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం
ప్రభుత్వానికి ఫ్యాప్టో, జాక్టో సంఘాల హెచ్చరిక