
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
టంగుటూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాతపడగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం ఫ్లయ్ ఓవర్‌పై చోటుచేసుకున్న ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చిన్నులగారిపల్లి గ్రామానికి చెందిన పులి గంగాధర్(35) మృతి చెందారు. ఆయన తన భార్య గాయత్రి, అత్త రాధ, కొడుకు గంధర్వ్‌తో కలిసి చైన్నె నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో సూరారెడ్డిపాలెం ఫ్లయ్ ఓవర్‌పై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో గంగాధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో గంగాధర్ అత్త రాధ, అతని కొడుకు గంధర్వ్ గాయపడగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రక్ ఢీకొనియువకుడు మృతి
పొదిలి: మినీ ట్రక్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం పొదిలి టైలర్స్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చీమకుర్తి మండలం లక్ష్మీపురం పంచాయతీ రాజుపాలేనికి చెందిన సుబ్బారావు పొదిలి పెద్ద చెరువు సాగర్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మల్లవరం సమీపంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్న సుబ్బారావును టైలర్స్ కాలనీ వద్ద ఒంగోలు నుంచి కనిగిరి వైపు వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి