
మద్యం మత్తులో మిత్రుల ఘర్షణ
● బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం
ఒంగోలు టౌన్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మిత్రుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకోగా.. ఓ యువకుడు పెట్రోల్ పోసి బైకును తగలబెట్టాడు. ఈ సంఘటన ఒంగోలు–కర్నూలు రోడ్డులోని పాలకేంద్రం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన లోనా రాం, అర్జున్, కిషోర్ స్నేహితులు. ముగ్గురూ చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమల్లో పనులు చేస్తుంటారు. ఆదివారం కావడంతో సరదాగా ఒంగోలు నగరానికి వచ్చారు. తాము తెచ్చుకున్న బైకులో పెట్రోల్ అయిపోవడంతో పాలకేంద్రం వద్ద ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంచారు. ఒక బాటిల్లో పెట్రోలు పోయించుకుని వస్తూ మార్గమధ్యంలోని ఓ వైన్ షాప్‌లో ముగ్గురూ కలిసి మద్యం తాగారు. మత్తు తలకెక్కడంతో వారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ కోపంతో ఓ వర్గం యువకుడు బైక్‌కు నిప్పంటించి తగులబెట్టాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.