
భార్య గొంతు కోసిన భర్త
● కుటుంబ కలహాల నేపథ్యమే కారణం
పెద్దదోర్నాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య గొంతు కోశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం పడమటపల్లెలో శనివారం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వివాహిత మల్లేశ్వరి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలిని 108లో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పెద్ద బొమ్మలాపురానికి చెందిన స్వేచ్ఛకుమార్, మల్లేశ్వరి దంపతులు. స్వేచ్ఛకుమార్ గతంలో కొన్నాళ్లు హోంగార్డుగా విధులు నిర్వహించాడు. కొన్ని కారణాల రీత్యా విధుల నుంచి పోలీసు అధికారులు తప్పించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమె అదే గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. గ్రామ సమీపంలో ఉన్న కొండ వద్దకు బహిర్భూమికి వెళ్లిన మల్లేశ్వరిని అటకాయించిన స్వేచ్ఛకుమార్ కత్తితో ఆమె గొంతు కోసి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

భార్య గొంతు కోసిన భర్త