
విద్యుదాఘాతానికి రైతు బలి
పొదిలి రూరల్: పొలంలో వ్యవసాయ విద్యుత్ బోరుకు సంబంధించిన పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పొదిలి మండలం అన్నవరంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యర్రంరెడ్డి చెన్నారెడ్డి (55) తన పొలంలో ఉన్న విద్యుత్ బోరుకు మరమ్మతులు చేస్తున్నాడు. బోరులోకి పైపులు దించే క్రమంలో పైన పొలాలకు సరఫరా చేసే 11కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చెన్నారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.