
పొలాలకు సాగర్ జలాలు
త్రిపురాంతకం: నాగార్జున సాగర్ ప్రధానకాలువకు సాగర్ జలాలు విడుదలయ్యాయి. సాగర్ జలాశయానికి ఎగువ భాగం నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో సాగునీటిని విడుదల చేశారు. ప్రకాశం జిల్లాకు 2600 క్యూసెక్కులు జిల్లా సరిహద్దులో చేరుతోంది. ఈఏడాది సకాలంలో కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సకాలంలో జలాశయాలు నిండటంతో సాగునీటి సరఫరాకు అనుకూలంగా మారింది. జిల్లా సరిహద్దు 85 మైలు వద్ద గురువారం తెల్లవారుజామున 1750 క్యూసెక్కుల నీరు చేరగా, సాయంత్రానికి 2600 క్యూసెక్కులు పెరిగినట్లు సాగర్ కాలువల డీఈ విజయలక్ష్మి తెలిపారు. సాగర్ ప్రధానకాలువ, రామతీర్థం వరకు నీరు చేరిన తదుపరి మేజర్లకు నీటిని విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. రెండు మూడు రోజులో సాగునీటి సరపరా పెరిగి మేజర్లకు సాగునీటిని అందించనున్నారు. పూర్తి స్థాయిలో సాగర్ ప్రధాన కాలువ ద్వార సాగునీటిని చివరి భూములకు ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.
నీటి సరఫరాను పరిశీలించిన సీఈ
నాగార్జున సాగర్ ప్రధానకాలువ నీటి సరఫరాను చీఫ్ ఇంజినీర్ బి.శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. ముందుగా తాగు నీటి చెరువులను నింపాలని అధికారులకు సూచించారు. త్రిపురాంతకం మండలం దూపాడు సాగర్ ప్రధాన కాలువపై సీఈ పర్యటించి అధికారులతో సాగర్ నీటి సరఫరాపై ఆరా తీశారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుని చెరువులు నింపాలన్నారు. సాగునీటి సరఫరా, ఆయకట్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట డీఈ విజయలక్ష్మి, ఏఈలు శ్రీమన్నారాయణ, భరత్, డిస్ట్రిబ్యూటరి కమిటీ చైర్మన్ చలమయ్య ఉన్నారు.
జిల్లా ప్రధాన కాలువకు నీటి సరఫరా
రెండు మూడు రోజులలో మేజర్లకు నీటి విడుదల

పొలాలకు సాగర్ జలాలు