
బయ్యర్లు కొంటుంటే వద్దంటావేంటి?
పొదిలి: వేలానికి ఉంచిన బేళ్లను బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా బోర్డు నిర్వహణాధికారి గిరిరాజ్‌కుమార్ అడ్డుకుంటున్నారంటూ ఓ రైతు ఆందోళనకు దిగారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఆరు బేళ్లను తీసుకొచ్చారు. మొత్తం బేళ్లు తిరస్కరణకు గురికావడంతో వేలం నిర్వహణాధికారి తీరుపై రైతు ఆగ్రహించారు. ఇలాగైతే రైతులకు న్యాయం ఎలా చేస్తావని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రైతును బయటకు వెళ్లాలంటూ నిర్వహణాధికారి హెచ్చరించారు. తనకు జరిగిన అన్యాయం, వేలం అధికారి తీరుపై పొగాకు బోర్డు చైర్మన్‌కు రైతు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. మంచి పొగాకును కూడా లోగ్రేడ్‌గా నిర్ణయించి రైతుల పొట్టకొడుతున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. తాను తెచ్చిన బేళ్లలో కొన్ని కొనడానికి బయ్యర్లు ముందుకొస్తే అవి వద్దని వేలం అధికారి అడ్డుతగిలారని వివరించారు. చివరికి బయ్యర్లను బతిమలాడి ఒప్పించి బేళ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతు చంద్రశేఖర్ వాపోయారు. ఇదిలా ఉండగా వేలం అధికారి తమను చిన్న చూపు చూస్తూ బేళ్లను సగానికి సగం వెనక్కి పంపుతుండటంతో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతు ఆందోళన