
తర్లుపాడు ఎంపీడీఓపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఒంగోలు సబర్బన్: స్వీపర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. అనంతరం సంఘ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటిమాదిగ మాట్లాడుతూ.. తర్లుపాడు పోలీసులు ఎంపీడీఓపై కేసు నమోదు చేిశారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు. ఎంపీడీఓపై చట్టపరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘ నాయకులు నేదరపల్లి జయరాజ్, రేణమాల మాధవ, రావినూతల వెంకటేష్, సూరపోగు మోజెష్, ఎనిబెర అబ్రహం, రోశయ్య తదితరులు ఉన్నారు.
పొలం వివాదంలో గొడ్డళ్లతో దాడి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
కొమరోలు: పొలం విషయమై దాయాదుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర స్థాయి ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటన కొమరోలు మండలంలోని గోనపల్లెలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన వారు గొడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోగా పెద్దినేని వెంకటేశ్వర్లు, పెద్దినేని శేఖర్, వసంత, రమణయ్య, లక్ష్మీదేవి, చంద్రయ్యకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లుగా ఎస్‌హెచ్‌ఓ నారాయణ తెలిపారు.