
బేళ్ల తిరస్కరణతో రైతులకు తీవ్ర నష్టం
ఒంగోలు టౌన్: పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేయి కోట్ల రూపాయలు కేటాయించాలని, వర్జీనియా పొగాకు క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జయంతి బాబు, పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వాతావరణం సరిగా లేకపోవడంతో ఈ ఏడాది పొగాకు దిగుబడి సరిగా రాలేదన్నారు. నాణ్యత లేదని సాకులు చెబుతూ వ్యాపారులు కొర్రీలు పెట్టడంతోపాటు రోజూ వందల సంఖ్యలో బేళ్లను వెనక్కి పంపిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వేలం మొదలైన తరువాత వందలాది మంది రైతులు నాలుగుసార్లు బేళ్లను వెనక్కి తీసుకెళ్లారని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఒక్కో బ్యారన్‌కు ఐదారు లక్షల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం శాపంగా మారకూడదని, ఇప్పటికే మిర్చి, నల్లబర్లీ పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పొగాకు రైతులకు మద్దతుగా గురువారం ఒంగోలులోని ఆర్‌ఎం కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పొగాకు కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.వేయి కోట్లు ఇవ్వాలి
రైతులు చస్తున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ అధ్యక్ష
కార్యదర్శుల ధ్వజం