
సెల్‌ఫోన్ల దొంగకు సంకెళ్లు!
● అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు
ఒంగోలు టౌన్: రైలులో ప్రయాణిస్తున్న వారి చేతుల్లోని సెల్ ఫోన్లను లాక్కుని నిమిషాల్లో మాయమయ్యే దొంగను ఒంగోలు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసు స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ షేక్ మౌలా షరీఫ్ వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 4వ లైనుకు చెందిన షేక్ రఫీ గత కొంతకాలంగా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. రైలు గేటు వద్ద కూర్చుని సెల్‌ఫోన్ చూసే ప్రయాణికుల చేతులపై కర్రతో కొట్టి కిందపడిన ఫోన్లను తీసుకుని ఉడాయించేవాడు. నిందితుడి మీద పలు స్టేషన్లలో 4 కేసులు, ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ నమోదై ఉన్నాయి. ఇతని కదలికలపై నిఘా ఉంచిన జీఆర్పీ పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.50 వేల విలువైన ఒప్పో మొబైల్ ఒకటి, రియల్ మీ ఫోన్లు 3, శాంసంగ్ ఫోన్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన జీఆర్పీ ఎస్సై మధుసూదన్‌రావు, సిబ్బందిని సీఐ మౌలా షరీఫ్ అభినందించారు.