ఒకటి రెండైంది.. సమస్య మెండైంది! | - | Sakshi
Sakshi News home page

ఒకటి రెండైంది.. సమస్య మెండైంది!

Jul 30 2025 7:04 AM | Updated on Jul 30 2025 7:04 AM

ఒకటి

ఒకటి రెండైంది.. సమస్య మెండైంది!

ప్రజలతోపాటు రెవెన్యూ యంత్రాంగానికి తలబొప్పి కట్టిస్తున్న తహసీల్దార్‌ కార్యాలయాల విభజన
లాగిన్ల తారుమారుతో అటుఇటూ తిరుగుతూ దరఖాస్తుదారుల తిప్పలు

లాగిన్లు తారుమారైన

విషయం వాస్తవమే

ఒంగోలు అర్బన్‌, ఒంగోలు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాలకు సంబంధించిన లాగిన్లు తారుమారైన విషయం వాస్తవమే. ఒంగోలు అర్బన్‌లోని శివారు గ్రామాలకు చెందిన లాగిన్లు ఒంగోలు రూరల్‌ తహసీల్దార్‌ లాగిన్‌కు వెళ్తున్నాయి. అదేవిధంగా ఒంగోలు మండలంలోని కొన్ని రూరల్‌ గ్రామాలకు చెందిన దరఖాస్తులు ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన ఆర్‌ఐ, వీఆర్‌ఓ, తహసీల్దార్‌ లాగిన్లకు వస్తున్నాయి. వీటిని గమనించి ఆర్‌ఐలు, వీఆర్‌ఓలకు తగిన సలహాలు, సూచనలు చేశాం. ప్రజలకు, దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాగిన్లు చెక్‌ చేసుకునేలా ఆదేశాలు జారీ చేశాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులే మార్పులు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఈ విషయంపై జిల్లా కేంద్రంలోని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీఎస్‌డబ్ల్యూఎస్‌) కార్యాలయ కో ఆర్డినేటర్‌కు లేఖ కూడా రాశాం.

– పిన్నిక మధుసూదన్‌రావు,

ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌

ఒంగోలు సబర్బన్‌:

ంగోలు తహసీల్దార్ల కార్యాలయాల్లో అధికారుల లాగిన్లలో గందరగోళం నెలకొంది. వాటిలో ఏం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టటం లేదు. రెండుమూడు నెలలుగా లాగిన్‌లలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో ఒంగోలు మండలం మొత్తానికి ఒకే తహసీల్దార్‌ కార్యాలయం ఉండేది. అలాంటిది ఏడాది క్రితం కొత్తగా ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఉన్న తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఒంగోలు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంగా మార్పు చేశారు. రెండు తహసీల్దార్‌ కార్యాలయాలుగా విభజించి రెండు కార్యాలయాలకు ఇద్దరు తహసీల్దార్లను కూడా నియమించారు. ఎవరి కార్యాలయాలను వాళ్లకు అప్పగించిన ఉన్నతాధికారులు ఎవరి లాగిన్‌ను వాళ్లకు ఏర్పాటు చేశారు కూడా. ఇంతవరకూ బాగానే ఉంది. అధికారులు, సిబ్బంది వరకు ఏ ఇబ్బందీ లేదు. మరి ఇబ్బంది వచ్చిపడిందల్లా ఒంగోలు అర్బన్‌, ఒంగోలు రూరల్‌ పరిధిలోని ప్రజలకే. ఏదైనా సర్టిఫికెట్‌ కావాలని గ్రామ, వార్డు సచివాలయంలోగానీ, మీ సేవా కేంద్రంలోగానీ దరఖాస్తు చేసుకుంటే.. అక్కడి నుంచే దరఖాస్తుదారునికి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. సంబంధిత వీఆర్‌ఓతో సంతకం పెట్టించి మీ సేవలోగానీ, గ్రామ, వార్డు సచివాలయంలోగానీ దరఖాస్తు చేసుకుంటే.. ఆ దరఖాస్తు ఆన్‌లైన్‌లో వెంటనే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) లాగిన్‌కు రావాల్సి ఉంది. ఉదాహరణకు ఒంగోలు రూరల్‌ మండలం దేవరంపాడు గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ ఫైల్‌ తీసుకుని ఒంగోలు రూరల్‌ ఆర్‌ఐ వద్దకు వస్తే ఆ దరఖాస్తు ఆర్‌ఐ లాగిన్‌లో కనపడదు. అదేవిధంగా ఒంగోలు అర్బన్‌కు చెందిన దరఖాస్తుదారుడు ఇందిరమ్మ కాలనీలోని వార్డు సచివాలయంలో ఇన్‌కం సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఒంగోలు అర్బన్‌ ఆర్‌ఐ వద్దకు వెళ్తే ఆ దరఖాస్తు ఒంగోలు అర్బన్‌ ఆర్‌ఐ లాగిన్‌లో కనబడదు. మీ సేవలో, సచివాలయాల్లో చేసిన దరఖాస్తులు ఏమవుతున్నాయని పరిశీలించగా, చివరకు తేలిందేమిటంటే ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఒంగోలు రూరల్‌ తహసీల్దార్‌ లాగిన్‌కు, రూరల్‌లో దరఖాస్తు చేసుకుంటే అర్బర్‌ తహసీల్దార్‌కు వెళుతున్నాయి.

వారాల తరబడి తిరగాల్సిన దుస్థితి...

తహసీల్దార్‌ కార్యాలయాలలో లాగిన్‌ సమస్యలతో అధికారులు తలలు పట్టుకోవటం ఒక ఎత్తయితే, దరఖాస్తు చేసుకున్న ప్రజలు అధికారులు, కార్యాలయాల చుట్టూ వారాల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది. రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు వేరైనప్పటికీ.. అధికారులు, సిబ్బంది వేరైనప్పటికీ ఒక్కో దరఖాస్తుదారుడు మాత్రం ఒంగోలు అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్ల వద్దకు, ఇద్దరు ఆర్‌ఐల వద్దకు, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్ల వద్దకు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నాడు. ఒకవైపు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరోవైపు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల కోసం దరఖాస్తు చేసుకోవటానికి నానా అవస్థలు పడుతున్నారు. రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తమ దరఖాస్తు ఎక్కడుందో తెలుసుకునేసరికే దరఖాస్తుదారులకు తలప్రాణం తోకలోకి వస్తోంది. వీటన్నింటికీ కారణం లాగిన్స్‌ అస్తవ్యస్తంగా తయారుకావడమే. ఒంగోలు నగరంలోని ప్రజలతో పాటు ఒంగోలు రూరల్‌ మండలంలోని గ్రామాల ప్రజలు సైతం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఒంగోలు తహసీల్దార్ల కార్యాలయాల్లో గందరగోళంగా లాగిన్స్‌ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రదక్షిణలు చేయాల్సిందే.. గతంలో ఒకటిగా ఉన్న తహసీల్దార్‌ కార్యాలయం ఇటీవల రెండుగా విభజన ఒంగోలు అర్బన్‌, ఒంగోలు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాలుగా ఏర్పాటు అర్బన్‌ తహసీల్దార్‌కు దరఖాస్తు చేస్తే రూరల్‌కి.. రూరల్‌ తహసీల్దార్‌కు చేస్తే అర్బన్‌కు వెళ్తున్న దరఖాస్తులు ఎవరి దరఖాస్తు ఎక్కడుందో తెలియక కాళ్లరిగేలా తిరుగుతున్న ప్రజలు

ఒకటి రెండైంది.. సమస్య మెండైంది!1
1/1

ఒకటి రెండైంది.. సమస్య మెండైంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement