
వారానికి రూ.700 వస్తున్నాయమ్మా..!
కంభం: ‘ ఉపాధి కూలి గిట్టుబాటు కావడం లేదమ్మా. కొన్నిసార్లు వారానికి రూ.700 నుంచి రూ.800 మాత్రమే వస్తున్నాయి’ అని ఉపాధి కూలీలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని కందులాపురం, కంభం పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రైతువారి నీటి గుంతలను మంగళవారం ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. మండలంలో ఎంతమంది ఉపాధిహామీ కూలీలు ఉన్నారు, వారిలో ఎంతమంది ఎంత పనిచేశారు, పని చేసిన కాలానికి ఎంత వరకు నగదు జమైందో విషయాలను డ్వామా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బంగారు కుటుంబంపై ఉపాధి సిబ్బందికి కనీస అవగాహన లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షం నీరు వృథాగా పోకుండా భూమిలోకి ఇంకించేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1075 రైతువారి నీటికుంటలు పూర్తి చేశామని, మరో 800 నీటికుంటలు పురోగతిలో ఉన్నాయన్నారు. పశ్చిమ ప్రకాశంలో రైతువారి నీటి కుంటల నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, తహసీల్దార్ వి.కిరణ్, ఏపిడి భాస్కరరావు, ఏపీఓ జీవరత్నం, ఇన్‌చార్జి ఎంపీడీఓ ఖాదర్, డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో ముఖాముఖి
స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పదోతరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థినులు నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా..తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అనంతరం ఆర్వోప్లాంట్‌ను, విద్యార్థినుల గదులను పరిశీలించారు.
కలెక్టర్ వద్ద వాపోయిన ఉపాధి కూలీలు
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
బంగారు కుటుంబంపై అవగాహన లేకపోవడంపై మండిపాటు