
ఒక్క రోజే 1,001 బేళ్ల తిరస్కరణ
టంగుటూరు/కొండపి: టంగుటూరు, కొండపి వేలం కేంద్రాల పరిధిలో మంగళవారం ఒక్క రోజే 1,001 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం కేంద్రాల చరిత్రలో ఒకే రోజు ఇన్నీ బేళ్లు తిరస్కరణకు కాలేదు. వ్యాపారులంతా కుమ్మకై ్క రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే 8 రౌండ్లు వేలం ముగిసినా నిత్యం వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రోజుకు 300 పైచిలుకు బేళ్లు తిరస్కరిస్తుంటే మంగళవారం ఒక్కో కేంద్రంలో 500 పైచిలుకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. మంగళశారం టంగుటూరు వేలం కేంద్రానికి 973 బేళ్లు రాగా 406 బేళ్లు కొనుగోలుచేసి 567 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160, సరాసరి ధర రూ.216.83గా నమోదైంది. వేలంలో 36 మంది వ్యాపారులు పాల్గొన్నట్లు బోర్డు అధికారులు ప్రకటిస్తున్నా..వాస్తవానికి 10 మంది కూడా పాల్గొనడం లేదు. దీంతో ఉన్న వ్యాపారులంతా కుమ్మకై ్క ఇష్టం వచ్చినట్లు ధరలు ఇచ్చి బేళ్లను తిరస్కరిస్తున్నారు. టంగుటూరు వేలం కేంద్రంలోకి రైతులను రానివ్వకుండా వేలం నిర్వహించడం విశేషం. అసలు రైతులను బయట పెట్టి వేలం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొండపిలో 9వ రౌండ్ వేలం మంగళవారం ప్రారంభమైంది. ఈ రౌండ్‌లోనైనా ధరలు వస్తాయని రైతులు ఆశలు పెట్టుకుంటే వారి ఆశలు ఆడియాశలు చేస్తూ ఒకే రోజు 534 బేళ్లను తిరస్కరించారు. జువ్విగుంట, అయ్యవారిపాలెం, జాళ్లపాలెం, పీరాపురం, తంగెళ్ల గ్రామాల రైతులు 1176 బేళ్లను తీసుకురాగా 642 బేళ్లను కొనుగోలు చేసి 534 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధరరూ.159, సరాసరి ధర రూ.241.01గా నమోదైంది.