
వితంతు పెన్షన్ల మంజూరుకు వితండవాదం
తాళ్లూరు: ప్రభుత్వ అధికారులను టీడీపీ నేతలు ఏ స్థాయిలో నియంత్రిస్తున్నారో తెలిపే ఉదంతమింది. పింఛన్లు మంజూరు కాకుండా మోకాలడ్డుతూ రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలకు అధికారులు తలొంచుతున్న తీరు తరచూ చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన గోనుగుంట పద్మావతి, కొర్రపాటి బుచ్చమ్మ వితంతు పింఛనుకు అర్హులు. తమకు పింఛను మంజూరు చేయాలని గత కొంత కాలంగా ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ‘మీ ఊరి సర్పంచ్ భర్త రామయ్య చెబితేనే పింఛను వస్తుందమ్మా’ అని ఎంపీడీఓ దారా హనుమంతరావు చెబుతున్నారని ఇద్దరు మహిళలు వాపోయారు. ‘కలెక్టర్ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చినా మండల అధికారులు స్పందించడం లేదు. మేము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే కారణంతో టీడీపీ వాళ్లు పింఛను రాకుండా ఎంపీడీఓపై ఒత్తిడి చేస్తున్నార’ని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీఓను వివరణ కోరగా.. వారు పింఛను కోసం వచ్చిన మాట వాస్తవమే. అనారోగ్యం దృష్ట్యా ఈ మధ్య సెలవులో ఉన్నా. వచ్చే సోమవారంలోగా సమస్య పరిష్కరిస్తా’ అని చెప్పారు.
సర్పంచ్ భర్త చెబితేనే ఎంపీడీఓ
ఇస్తారట!
తాళ్లూరు మండలం
కొర్రపాటివారిపాలెం మహిళ ఆవేదన