
వ్యాయామ ఉపాధ్యాయునిపై విచారణ
సింగరాయకొండ: మండలంలోని ఊళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిపై వచ్చిన అరోపణలపై కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో డీఈఓ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం విచారణ చేపట్టారు. కమిటీ సభ్యులు ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, జీసీడీఓ కె.హేమలత, ఎంఈఓ–1 కె.శ్రీనివాసులు ముందుగా పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినులతో సమావేశమయ్యారు. తరువాత ఒక విద్యార్థి తల్లిని పిలిపించి ఆమె అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలుసుకున్నారు. చివరగా ఊళ్లపాలెం ఉన్నత పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టాల్సి ఉండగా డీఈఓ నుంచి అత్యవసర సమావేశం అని ఫోన్ రావడంతో బుధవారం విచారణ కొనసాగిస్తామని వెళ్లిపోయారు. విచారణ వివరాలను కమిటీ సభ్యులు గోప్యంగా ఉంచారు.