
నేతల విగ్రహాలకు ఎసరు..!
ఒంగోలు సబర్బన్:
నగరంలో గతంలో నెలకొల్పిన నాయకుల విగ్రహాలకు తంటా వచ్చి పడింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ విగ్రహాల మీదనే టీడీపీ నాయకుల కన్ను పడింది. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందున్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాలు తొలగించేందుకు మంగళవారం జరగనున్న ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయంగా మారాయనే కారణంగా ఈ రెండు విగ్రహాలను అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇక కౌన్సిల్ ఆమోదమే తరువాయి.
ట్రంకురోడ్డు విస్తరణపై కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు..
ట్రంకురోడ్డు విస్తరణపై కూటమి పార్టీలు తలోదారిగా వ్యవహరిస్తున్నాయి. ట్రంకురోడ్డు 100 అడుగులు, దర్గా నుంచి బీవీఎస్ హాలు మీదుగా కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వరకు 80 అడుగులతో విస్తరించాలని నిర్ణయించారు. అయితే 100 అడుగుల విస్తరణ అనేసరికి ట్రంకురోడ్డులోని వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఆర్థికంగా కుదేలవుతామని మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం మార్కింగ్ ఇస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల, టీడీపీ కార్పొరేటర్లు 100 అడుగులకు సై అంటున్నారు. జనసేన మాత్రం 60 అడుగులే అంటోంది.
124 అంశాల్లో 50కిపైగా ముందస్తు అనుమతులే...
కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవటంతో ఇంత వరకు స్టాండింగ్ కమిటీ ఊసేలేదు. రూ.50 లక్షల వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు మేయర్ సుజాత ముందస్తు అనుమతులిచ్చి ఆ తర్వాత కౌన్సిల్ ఆమోదానికి పెడుతున్నారు. అందులో భాగంగానే ఈసారి మేయర్ సొంత డివిజన్ అయిన 18వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు రూ.కోట్లు కుమ్మరించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ప్రధాని పీవీ, మాజీ సీఎం కొణిజేటి విగ్రహాల తొలగింపునకు కుట్ర మేయర్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు రూ.కోట్ల కుమ్మరింపు నేడు ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం
రూ.15 లక్షలు ఎగ్గొట్టిన వ్యక్తికే తిరిగి ఎన్‌టీఆర్ కళాక్షేత్రం...
ఎన్‌టీఆర్ కళాక్షేత్రం నిర్వహణ బాధ్యతలను గతంలో రూ.15 లక్షలు ఎగ్గొట్టిన వ్యక్తికే తిరిగి కట్టబెట్టనున్నారు. గతంలో లీజుకు తీసుకున్న వై.త్రిశంకరరావు రూ.15 లక్షలు బాకీ పడి అవి కట్టకుండానే కళాక్షేత్రంలోని అన్ని సామాన్లు పీక్కెళ్లాడు. చివరకు బ్యాంకు గ్యారంటీని కూడా డ్రా చేసుకున్నాడు. వీటన్నింటికీ నగర పాలక సంస్థ అధికారుల అండదండలున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత అండదండలతో తిరిగి ఎన్‌టీఆర్ కళాక్షేత్రం నిర్వహణను కారు చౌకగా అతని బినామీకే కట్టబెట్టనున్నారు. నెలకు రూ.80,315 అద్దె నిర్ణయించి చివరకు రూ.38,150కు మాత్రమే కట్టబెట్టే అంశాన్ని కూడా కౌన్సిల్‌లో ఆమోదానికి పెట్టారు.

నేతల విగ్రహాలకు ఎసరు..!