
దోచుకున్న సొమ్ము సింగపూర్‌కి..
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి దోచుకున్న సొమ్ముతో సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టేందుకే సీఎం చంద్రబాబు రాష్రానికి పెట్టుబడుల ముసుగులో సింగపూర్ వెళ్లారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కాకుమాను రాజశేఖర్ ఆరోపించారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014–19 మధ్యలో, 2024 నుంచి ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ రకంగా భూముల దోపిడీకి పాల్పడ్డారో అందరికీ తెలుసన్నారు. అమరావతి పేరుతో 33 వేల ఎకరాలను రైతుల దగ్గర తీసుకుని తిరిగి 45 వేల ఎకరాలు కావాలంటూ ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లడం వెనుక పెద్ద కుట్ర దాగిఉందన్నారు. తన ముఖ్య అనుచరులు, పార్టీ నాయకులకు భూములు అప్పగించేందుకే ఈ దోపిడీ జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. 2019కి ముందు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు భూ కేటాయింపులు చేశారని, కేవలం ఒక్క కంపెనీ కూడా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. అమరావతి పేరుతో వేలాది ఎకరాలు సేకరించి ఒక్క శాశ్వత కట్టడం కూడా చేపట్టలేదని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా అమరావతి ప్రాంతంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. మూడు పంటలు పండే భూములిచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేస్తున్నారన్నారు. తాజాగా విశాఖ బీచ్‌లో విలువైన భూములు కాజేసేందుకు పెద్ద ఎత్తున దందా జరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ బస్టాండ్‌లో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం అన్యాయమన్నారు. రూ.156 కోట్ల పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందన్నారు. పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల కోసం ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగా బస్టాండ్‌ను గొల్లపూడి ఎలా తరలిస్తారని నిలదీశారు. చంద్రబాబు ఈ విధంగా అరాచకపాలన సాగిస్తున్నారని రాజశేఖర్ ధ్వజమెత్తారు. వ్యాపార సంస్థలేమీ సేవా సంస్థలు కాదన్నారు. ఇష్టారాజ్యంగా వారికి కేటాయింపులు చేయడం సరికాదన్నారు. వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. ఒంగోలులో కూడా ఏ విధంగా భూములు ఆక్రమిస్తున్నారో చూస్తున్నామన్నారు. వీటన్నింటిపై వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా విచారణ జరుపుతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కార్పొరేటర్లు ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, వలంటీర్ల విభాగం అధ్యక్షుడు నాటారు జనార్దనరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శ్యాంసాగర్, నాయకులు గౌతమ్, పెట్లూరు ప్రసాద్, 13వ డివిజన్ అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.