ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌

Jul 28 2025 7:19 AM | Updated on Jul 28 2025 7:19 AM

ప్రకృ

ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌

జిల్లాలోని పలు మండలాల్లో

పర్యటించిన కేరళ బృందం

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన

ఒంగోలు సబర్బన్‌: ప్రకృతి వ్యవసాయ విధానాలపై లోతైన అవగాహన, శిక్షణ కోసం కేరళ నుంచి వచ్చిన 34 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం జిల్లాలో ఆదివారం పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను బృందం సందర్శించింది. ప్రకృతి వ్యవసాయం జిల్లా డీపీఎం వి.సుభాషిణి నేతృత్వంలో కేరళ బృందం తొలుత మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు పొలాన్ని పరిశీలించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 20 రకాల పంటల వైవిధ్యంతో సాగు చేస్తున్న విధానాలను వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కొత్తపట్నం మండలం పాదర్తిలో రైతు మస్తాన్‌ సాగు చేస్తున్న ఏ–గ్రేడ్‌ వేరుశనగ పంటను కేరళ బృందం వీక్షించింది. మస్తాన్‌ అనుసరిస్తున్న అంతర పంటలు, సరిహద్దు పంటల ప్రయోజనాలను బృందం తెలుసుకుంది. కొత్తపట్నానికి చెందిన మల్లేశ్వరి బయో–రిసోర్స్‌ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఘన జీవామృతం తయారీ ప్రక్రియ, విత్తనశుద్ధి చర్యలపై ప్రాక్టికల్‌ డెమోను ప్రత్యక్షంగా చూశారు. కేరళ బృందంతో పాటు రైతు సాధికార సంస్థ సీనియర్‌ కన్సల్టెంట్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డీవీ రాయుడు, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సుభాషిణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

తర్లుపాడు: మండలంలోని కలుజువ్వలపాడు నవోదయ కళాశాల ఎదురుగా అటవీ ప్రాంతంలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు రాగసముద్రానికి చెందిన బి.విష్ణుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆర్టీసీ బస్సుల్లో చోరీలు చేసే వ్యక్తి అరెస్టు

10 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

విలేకరుల సమావేశంలో వివరాలు

వెల్లడించిన వన్‌టౌన్‌ సీఐ నాగరాజు

ఒంగోలు సిటీ: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగ్‌లు చోరీ చేసే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుడు కందుకూరుకు చెందిన విసా రమేష్‌బాబును ఒంగోలు భాగ్యనగర్‌ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 ల్యాప్‌టాప్‌లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.2,50,000 ఉంటుందని తెలిపారు. ఒంగోలు వన్‌టౌన్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల్లో ప్రయాణించేవారు తమ వెంట తీసుకువెళ్లిన బ్యాగ్‌లను బస్సులో పెట్టి ఆర్టీసీ బస్టాండ్‌లో టిఫిన్‌కి లేదా భోజనం నిమిత్తం దిగేవారిని గమనించి నిందితుడు చోరీకి పాల్పడేవాడు. కందుకూరుకు చెందిన వీసా రమేష్‌బాబు ప్రయాణికుడిలా బస్సు ఎక్కినట్లు నటించి ప్రయాణికులు సీట్లో లేకుండా బ్యాగులు మాత్రమే సీట్లు ఉన్న చోట కూర్చొని అతని దగ్గర ఉన్న ఖాళీ బ్యాగ్‌ పెట్టి చాకచక్యంగా వారి బ్యాగ్‌ దొంగిలించేవాడని తెలిపారు. గత రెండేళ్లుగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న సుధాకర్‌ అనే వ్యక్తి విజయవాడ నుంచి తిరుపతి వెళుతూ ఒంగోలు బస్టాండ్‌లో మంచినీళ్ల బాటిల్‌ కోసం దిగాడు. నిందితుడు వీసా రమేష్‌బాబు..సుధాకర్‌ బ్యాగ్‌ను తీసి అందులోని రూ.5 వేల నగదు, విలువైన పత్రాలు అపహరించాడు. సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఆర్టీసీ బస్టాండ్‌లోనీ సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. నిందితుడు ఆదివారం ఒంగోలు భాగ్యనగర్‌ వద్ద ఉండగా అరెస్టు చేసి అతని వద్ద మొత్తం 10 ల్యాప్‌టాప్‌లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనపరిచిన టుటౌన్‌ సీఐ నాగరాజు, ఒంగోలు టుటౌన్‌ ఎస్సై సువర్ణ, ఓ.సురేష్‌, ఏఎస్సై సాయి, సిబ్బంది విజయ్‌, కానిస్టేబుళ్లు అనిల్‌ను ఎస్పీ అభినందించారు.

ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌ 1
1/2

ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌

ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌ 2
2/2

ప్రకృతి వ్యవసాయ విధానం భేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement