
సంక్షోభంలో విద్యారంగం
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో విద్యారంగంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం దాదాపు 18 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఫలితంగా ఒక తరం విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ పోరాటం చేయనుందని ప్రకటించారు. ఇది కేవలం రాజకీయపరమైనది కాదని, రాష్ట్ర భవిష్యత్, విద్యార్థుల భవితకు సంబంధించిందని, రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు పలకాలని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి విద్యర్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించేలా ఉద్యమం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను రోడ్డున పడేశాడని ధ్వజమెత్తారు. సకల శాఖల మంత్రిగా ఉన్న లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన వారు, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారన్నారు. ఇంటర్ తెలంగాణలో చదివి ఇక్కడ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టడం సరికాదన్నారు.
పేదలకు అండగా వైఎస్సార్...
ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, తదితర ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదని కేవీ రమణారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పథకానికి గ్రహణం పట్టించారని ధ్వజమెత్తారు. దాదాపు రూ.1700 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఫలితంగా పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చారన్నారు. అలాగే క్రమం తప్పకుండా విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాల ద్వారా నిధులు ఇచ్చి పేద విద్యార్థులకు అండగా నిలిచారన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య భారం కాకుండా చూశారన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించి ఆరు క్వార్టర్లు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫలితంగా కళాశాల నిర్వహణ భారంగా మారడంతో నాణ్యమైన విద్య అందించేందుకు యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తమ బిడ్డల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. కొంచెం డబ్బులున్న వారు తమ పిల్లలను పొరుగు రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరుస్తున్నారన్నారు. ఫలితంగా ఉన్నత విద్యలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, రాష్ట్ర ఇంటలెక్చువల్ ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న
కూటమి ప్రభుత్వం
పేరుకుపోతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
విద్యార్థుల పక్షాన పోరాటానికి
వైఎస్సార్ సీపీ సిద్ధం
మేధావులు, విద్యార్థి సంఘాలు కలిసిరావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి పిలుపు