
దేవస్థాన భూములను ఆక్రమిస్తే చర్యలు
పామూరు: దేవస్థాన భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ జిల్లా అధికారి పానకాలరావు, ఈఓ శ్రీగిరిరాజ నరసింహబాబు హెచ్చరించారు. పామూరు మండల కేంద్రంలోని నెల్లూరు రోడ్డు, విరువూరు రోడ్డులో సర్వేనంబర్లు 441/1, 2, 3, 442/1, 2, 3లోని 28 ఎకరాలు, సర్వే నంబర్ 256/2లోని 29.33 ఎకరాల భూమిని శుక్రవారం పరిశీలించారు. శ్రీమదన వేణుగోపాలస్వామి, వల్లీ భుజంగేశ్వరస్వామి ఆలయ భూములను కొందరు ఆక్రమించి గుడిసెలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా పరిశీలించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థాన భూముల్లో ఎలా నిర్మాణాలు చేపట్టారని నిలదీశారు. కొన్నిచోట్ల ఆక్రమణలు తొలగించారు. అదేవిధంగా ఆలయ భూముల్లో ఉన్న చిల్లచెట్లను తొలగించారు. గతంలో 32 కుటుంబాలే ఉండగా, నేడు 90 కుటుంబాల వరకూ ఆక్రమించారని, తక్షణమే ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించకుంటే తామే జేసీబీలతో తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై టి.కిషోర్‌బాబు, కేవీ రమణయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, బండ్లా నారాయణ పాల్గొన్నారు.
రేపు బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఒంగోలు: బాస్కెట్‌బాల్ జిల్లా జట్లను ఈ నెల 27వ తేదీ కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఎంపిక చేయనున్నట్లు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వలేటి రవీంద్ర, తొట్టెంపూడి సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బాలబాలికలు 2007 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. హాజరుకాదలచుకున్న వారు వయస్సు ధ్రువీకరణ పత్రంతో రావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 14 నుంచి 17వ తేదీ వరకు పిఠాపురంలో నిర్వహించనున్న పదో జూనియర్ బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
దేవదాయశాఖ జిల్లా అధికారి పానకాలరావు
ఆలయ భూముల్లో ఆక్రమణలు, చెట్ల తొలగింపు

దేవస్థాన భూములను ఆక్రమిస్తే చర్యలు