గంజాయి, చెయిన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి, చెయిన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్టు

Jul 26 2025 10:00 AM | Updated on Jul 26 2025 10:26 AM

గంజాయి, చెయిన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్టు

గంజాయి, చెయిన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్టు

ఒంగోలు సిటీ: గంజాయి విక్రయాలు, చెయిన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్టు ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు తెలిపారు. రూ.30 వేలు విలువచేసే గంజాయి, రూ.14.50 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. సింగరాయకొండకు చెందిన గుంజి నరసింహారావు గంజాయికి అలవాటుపడ్డాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి విక్రయదారులు మిలన్‌ దాస్‌, శంకర్‌ పటేకర్‌, హడిలతో పరిచయం పెంచుకున్నాడు. వారి వద్ద నుంచి కొద్ది మొత్తంలో గంజాయి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఒంగోలులో విక్రయించి డబ్బు సంపాదించాలని నరసింహారావు ఆశపడ్డాడు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులకు వెళ్లి అక్కడ వారికి కొంత మొత్తం డబ్బు చెల్లించి గంజాయి తీసుకునేవాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంత దూరం రైలు, మరికొంత దూరం బస్సుల్లో ప్రయాణించి ఒంగోలు చేరుకునేవాడు. ఇంటికి వెళ్లి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసేవాడు. వాటిని ఒంగోలు నగరంలోని కాలేజీల వద్ద ప్యాకెట్‌ రూ.300 నుంచి రూ.500 వరకూ విక్రయించేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో నరసింహారావుకు ఒంగోలుకు చెందిన గంజాయి విక్రయదారులు గోపాలకృష్ణ, అల్తాఫ్‌ పరిచయమయ్యారు. నరసింహారావు తెచ్చిన గంజాయిలో వారికి కూడా కొంత ఇచ్చేవాడు. వారు కూడా ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేవారు. అల్తాఫ్‌ స్నేహితులు నగరానికి చెందిన ఎనుగంటి కార్తీక్‌, మోట నవీన్‌, ఆవులమంద అంకబాబు, ఎకాంబరం నరేంద్ర, కుందురు ప్రవీణ్‌, తన్నీరు అఖిల్‌, షేక్‌ కృపారావులు కూడా గంజాయి ప్యాకెట్లు విక్రయించేవారు. వచ్చిన లాభాన్ని అంతా పంచుకునేవారు. ఈ క్రమంలో గంజాయిని తెచ్చేందుకు నరసింహారావు వైజాగ్‌ వెళ్లాడు. అక్కడి నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు వెళ్లి ఒక కేజీ గంజాయి తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టాడు. తెచ్చిన గంజాయిని గోపాలకృష్ణ, అల్తాఫ్‌లకు ఇచ్చేందుకు ముక్తినూతలపాడు గ్రామ శివారులోని ధరణి వెంచర్‌ వద్దకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఒంగోలు తాలూకా పోలీసులు మాటు వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 వేలు ఉంటుంది. వీరిని విచారించగా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్న షేక్‌ కృపారావు మహిళల మెడల్లో చెయిన్లు అపహరించేవాడని గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.14.50 లక్షల విలువైన 145 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ముఠా పరారీలో ఉందని, వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement