
వాహన తనిఖీల్లో వెనుకబడిన జిల్లా
ఒంగోలు సబర్బన్: వాహన తనిఖీల్లో ప్రకాశం జిల్లా రవాణా శాఖ అధికారులు వెనుకబడ్డారని గుంటూరు రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎన్.శివరామప్రసాదు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక వెంగముక్కలపాలెం రోడ్డులోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత జిల్లాలోని రవాణా శాఖ డీటీసీ, ఆర్‌టీఓలు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనల మేరకు భారీ, అతి భారీ ట్రాలీలు, టర్బో లారీలు, టిప్పర్లు సరుకు రవాణా చేసుకోవాలని, ఓవర్ లోడుతో రోడ్డు మీదకు వస్తే కేసులు రాసి పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో రవాణా అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు తగ్గాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా డీటీసీ ఆర్.సుశీల, ఆర్‌టీఓలు కలిసి గ్రూప్ చెకింగ్‌లు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. 24/7 తనిఖీ అధికారులు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పామన్నారు. జిల్లా వ్యాప్తంగా లైఫ్ ట్యాక్స్ రాబడి దాదాపు రూ.3 కోట్లకుపైగా మైనస్‌లో ఉందన్నారు. వాహనాల విక్రయాల షోరూముల వద్ద నుంచే లైఫ్ ట్యాక్స్‌లు రావాల్సి ఉందని, మరి ఎక్కడ లోపం జరిగిందో ఎగ్జిక్యూటివ్ అధికారులతో తనిఖీలు చేయిస్తామని చెప్పారు. షోరూమ్‌ల నిర్వాహకులు లైఫ్ ట్యాక్సులు సక్రమంగా కట్టకపోవటం వలనే వాహనాల అమ్మకాలకు, లైఫ్ ట్యాక్సుకు తేడా ఉందన్నారు. అదేవిధంగా క్వార్టర్లీ వాహన ట్యాక్సులు రూ.2 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. రహదారుల మీద తనిఖీలు లేనందువలనే మూడు నెలలకు ఒకసారి కట్టాల్సిన ట్యాక్స్‌లు కట్టకుండా రోడ్ల మీద వాహనాలు తిరుగుతున్నాయన్నారు. అందుకోసం రెండు మండలాలకు ఒక మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 100 శాతం రెవెన్యూ వసూలయ్యేలా డీటీసీ ఆర్.సుశీలను ఆదేశించామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల, మార్కాపురం ఆర్‌టీఓ వై.శ్రీచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.