
మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా..?
● ‘ఆడబిడ్డ నిధి’పై అచ్చన్నాయుడు
వ్యాఖ్యలపై బూచేపల్లి మండిపాటు
దర్శి: ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి ఎంతమంది మహిళలుంటే అంతమందికీ ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాక ‘ఆడబిడ్డ నిధి’ అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలని అన్న అచ్చన్నాయుడు వ్యాఖ్యలపై దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 18 నుంచి 59 సంవత్సరాలున్న ఒక్కో మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు చొప్పున సుమారు 2 కోట్ల మంది మహిళలకు దాదాపు రూ.33 వేల కోట్లు ఇప్పటికే ఇవ్వాల్సి ఉందన్నారు. ఏరు దాటే దాకా ఏరు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కూటమి ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. ఒక్క పథకాన్ని అమలు చేయాలంటేనే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయాలని చెప్పే మీరు 143 హామీలు ఎలా ఇచ్చారని, అది ప్రజలను మోసం చేయడం కాదా అని కూటమి నాయకులను ప్రశ్నించారు. మహిళలను మోసం చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ముందు ఆశపెట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన సంవత్సరం తరువాత కూడా వారికి డబ్బులు చెల్లించకుండా దారుణంగా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీనే అమలు చేయలేకపోతే మిగతా హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.