
నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
● వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులతో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు సబర్బన్: నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ హెచ్చరించారు. వ్యాపారులు అలాంటి చర్యలకు పూనుకుంటే సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ మేరకు మంగళవారం తన ఛాంబర్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతులు, కూరగాయల వ్యాపారులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో టమోటా, ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో టమోటా, ఉల్లి ధరలు పెరిగితే చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని మార్కెట్ల నుంచి ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకొని దిగుమతి చేసుకోవాలన్నారు. వాటిని ప్రజలకు సరసమైన ధరలకు లాభ, నష్టాలు లేకుండా అందజేయాలన్నారు.
రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహిస్తూ ప్రతి రైతు బజారులో స్టాలు కేటాయించాలని కూడా అధికారులను ఆదేశించారు.