
పారిశుధ్యంలో అలసత్వం వహిస్తే చర్యలు
ముండ్లమూరు(దర్శి): పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెద్ద ఉల్లగల్లు గ్రామాలను కలెక్టర్ మంగళవారం సందర్శంచారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, పీ–4 విధానంలో సర్వే తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కలెక్టర్ పూరిమెట్ల గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. రోజూ క్షేత్రస్థాయిలో చెత్త సేకరణను పర్యవేక్షించాలని డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శి, ఏఈలు, వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీటి పైప్‌లైన్లలో మురుగునీరు కలవకుండా తగు మరమ్మతులు చేయాలన్నారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. పారిశుధ్య నిర్వహణ ఏ విధంగా ఉంది, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. కెల్లంపల్లిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మీ కంపోస్టు తొట్టెలను పరిశీలించారు. గ్రామంలో చెత్త సేకరణ, సేకరించిన చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారు వివరాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం పెద్ద ఉల్లగల్లు గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, వర్మీ కంపోస్ట్ తొట్టెలు, వాటి పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.