
ధరలు కనిష్టం.. కష్టాలు గరిష్టం!
జిల్లాలోని వేలం కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 1.24 లక్షల బేళ్ల తిరస్కరణ
పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించాల్సిన కూటమి సర్కారు.. రైతులను కష్టాల కొలిమిలోకి నెట్టి చలికాచుకుంటోంది. పెట్టుబడి సొమ్ము కూడా చేతికిరాలేదని
గత ఏడాది నుంచి రైతులు గగ్గోలు
పెడుతుంటే.. రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు తెగ తాపత్రయ పడుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిర్చి, కంది, శనగ రైతుల
బాటలోనే ఈ ఏడాది పొగాకు రైతులు
భారీ నష్టాలను మూటగట్టుకున్నారు.
మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలని పొగాకు రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా సర్కారు నుంచి కనీస స్పందన
కరువైంది. రైతులు ధరల కోసం అర్థిస్తుంటే ఆవగింజంతైనా కనికరం చూపని సీఎం
చంద్రబాబునాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నటించిన సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘మీ కోరిక మేరకు ఈ రోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి, మన సినిమా ఇప్పుడు రిలీజవుతోంది’ అని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు.
టంగుటూరు:
గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులు.. బేళ్ల తిరస్కరణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా పరిధిలోని 7 వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గత రెండేళ్లలో పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈ దఫా పొగాకు సాగుపై అమితాసక్తి చూపారు. జిల్లాలో 24,130 బ్యారన్ల కింద 67 వేల హెక్టార్లలో 105.27 మిలియన్ కిలోల పొగాకు పండించేందుకు టుబాకో బోర్డు అనుమతించింది. అయితే రైతులు 144 మిలియన్ కిలోల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. 2024–25 పంట కాలానికి సంబంధించి మార్చి నెల మూడో వారంలో పొగాకు వేలాన్ని ప్రారంభించగా.. ఆది నుంచే గిట్టబాటు ధర కల్పించాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలం ప్రారంభంలో పొగాకు గరిష్ట ధర కేజీ రూ.280, కనిష్ట ధర కేజీరూ 240గా ఉంది. ఇవే ధరలు కొన్ని రోజులు కొనసాగాయి. వేలం సాగేకొద్దీ ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులు.. రోజులు గడుస్తున్నకొద్దీ ధరలు తగ్గుముఖం పట్టడాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. గత ఏడాది కేజీ రూ.360 పలికిన పొగాకు ఈ ఏడాది రూ.240కు మించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. పొగాకు కనిష్ట ధర కేజీ రూ.160కి పడిపోయింది. వేలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కనిష్ట ధర కేజీకి 80 రూపాయల మేర తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
లోగ్రేడా.. తీసెయ్ తీసెయ్..
వేలానికి తీసుకొచ్చిన లోగ్రేడ్ పొగాకును వ్యాపారులు పదేపదే తిరస్కరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో లోగ్రేడ్ పొగాకును ఎగబడి కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ఏడాది అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి. అధిక సంఖ్యలో బేళ్లను తిరస్కరిస్తూ, లోగ్రేడ్ బేళ్లను అసలు కొనుగోలు చేయకపోవడంతో టంగుటూరులో రెండు రోజుల క్రితం రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. అన్ని బేళ్లు కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వేలం తిరిగి మొదలైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు.
తిరస్కరణతో అదనపు భారం
బేళ్ల తిరస్కరణతో అదనపు ఆర్థిక భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో వేలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో కేంద్రంలో కనీసం 20 వేల బేళ్లను తిరస్కరించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బేళ్లను వేలం కేంద్రం నుంచి ఇంటికి తీసుకెళ్లి తిరిగి తెచ్చే క్రమంలో ఐదు నుంచి పది కేజీల వరకు తూకం తగ్గుతోందని, ఒక్కో బేల్‌పై రూ.2 వేల వరకు నష్టం వస్తోందని, అదనపు శ్రమ పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేళ్లను తిరస్కరించకుండా కనీస ధరకై నా కొనుగోలు చేస్తే కొంతమేరైనా నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందన్నది రైతుల వాదన. ఓ వైపు కూలి సొమ్ము చెల్లించాలని కూలీలు ఒత్తిడి చేస్తుండటం.. మరోవైపు కనీస గిట్టుబాటు ధర లేకపోవడం, బేళ్లను పదే పదే తిరస్కరిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యాపారుల సిండికేట్‌తో బోర్డు అధికారులు కుమ్మకై ్క పొగాకు రైతులను నిలువునా ముంచుతున్నారని, ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని బేళ్లు కొనాలి
వేలానికి తీసుకొచ్చే అన్ని బేళ్లను కొనుగోలు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. కూలీలు డబ్బు కోసం ఒత్తిడి చేస్తున్నారు. పొగాకు అమ్మి డబ్బులిస్తామంటే ఇప్పటి వరకు ఆగారు. బోర్డులో చూస్తే పొగాకు అమ్ముడు పోక ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం. గిట్టుబాటు ధర కల్పించకపోతే తీవ్ర నష్టాల్లో కూరుకుపోతాం.
– కొత్తపల్లి శ్రీనివాసులు, జమ్ములపాలెం(టంగుటూరు)
మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి
ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలి. వ్యాపారుల కుమ్మకై ్క ధరలను దిగ్గోస్తూ లో గ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయడం లేదు. ఇళ్ల వద్దనే బేళ్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. వేలాన్ని అడ్డుకుంటే అప్పటికప్పుడే చిన్న చిన్న హామీలతో రైతులను బుజ్జగిస్తూ తిరిగి కొనసాగిస్తున్నారు. బోర్డు అధికారులు, ప్రభుత్వాలు రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని పొగాకు కొనుగోలు చేయాలి.
– సింగమనేని బ్రహ్మయ్య. మర్లపాడు
పొగాకు వేలం ప్రారంభం నుంచే వ్యాపారుల సిండికేట్
కూటమి ప్రభుత్వం, టుబాకో బోర్డు తీరుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
పంటల ధర పెంచమంటుంటే.. సినిమాల రేట్లు పెంచుతారా?
కూటమి సర్కారుపై మండిపడుతున్న రైతులు