
అంగన్‌వాడీలా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల
అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో
పిల్లలను కేంద్రాలకు పంపించే
తల్లిదండ్రులు ఆందోళనకు
గురవుతున్నారు. సొంత భవనాలు
లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో
కేంద్రాల నిర్వహిస్తుండగా, కొన్ని చోట్ల
శిథిలావస్థకు చేరి ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్రాలను నడిపిస్తున్నారు. కేంద్రాల్లో అరకొర సౌకర్యాలు, మరోవైపు రకరకాల యాప్‌ల భారంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అంగన్‌వాడీ సిబ్బంది వాపోతున్నారు.
కంభం:
బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరేళ్ల లోపు చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన వసతులు, సౌకర్యాలు లేక తమ పిల్లలను అక్కడికి పంపించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. పోషకాహారం అందించడానికి, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పనులన్నీ యాప్ లలో పొందుపరచాల్సి రావడంతో అదనపు భారం పడుతోందని, యాప్‌లు సక్రమంగా పనిచేయక, గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, వసతులు మెరుగుపరచి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అరకొర సౌకర్యాలతో అవస్థలు:
జిల్లాలో ఉన్న 2903 అంగన్‌వాడీ కేంద్రాల్లో చాలా చోట్ల సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో కేంద్రాల నిర్వహణ సిబ్బందికి భారంగా మారుతోంది. చాలా కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో కేంద్రానికి వచ్చే చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామానికి చివరగా ఉండటం, కేంద్రాల చుట్టూ చిల్లచెట్లు పెరిగిపోవడంతో ఆ ప్రాంతాలు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
జిల్లాలో 1133 అద్దె భవనాల్లో
కేంద్రాల నిర్వహణ:
జిల్లాలో 1133 చోట్ల అద్దె భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో సరైన సౌకర్యాలు, వసతులు లేకపోవడం, భవనాలు పాతబడి శిథిలావస్థకు చేరడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు జంకుతున్నారు. అద్దె భవనాలకు నెలనెలా అద్దెలు చెల్లించాల్సి ఉండగా అంగన్‌వాడీ టీచర్లు వారి జీతాల్లో నుంచి కట్టి ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే వరకు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
శిథిలావస్థకు చేరిన గదుల్లో
బిక్కుబిక్కుమంటూ..
సొంత భవనాలు, అద్దె భవనాలు లేని కొన్ని గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాల్లోనే కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. కొన్ని చోట్ల రెండు, మూడు కేంద్రాలను ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో గదులు పెచ్చులూడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో పిల్లలను గదుల్లో కూర్చోబెట్టడానికి భయపడి వరండాల్లో కూర్చోపెట్టి పిల్లలకు పాఠాలు బోధిస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో భవనాలు కుంగిపోయి ప్రమాదకరంగా మారిపోతుండటంతో సమీపంలో ఉన్న మరో కేంద్రంలోకి వారిని కలిపేస్తున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తుండటంతో గదులు కారుతుండటంతో పాటు శిథిలావస్థకు చేరిన పై కప్పులు ఎక్కడ కూలిపోతాయో అని దిన దినగండంగా గడుపుతున్నారు. ఏవైనా ప్రమాదాలు జరగకముందే అధికారులు చొరవచూపి ప్రమాదకరంగా ఉన్న భవనాల నుంచి పిల్లలను మరోచోటుకు మార్చాలని కోరుతున్నారు.
లింగోజిపల్లి ఘటనతో ఉలిక్కిపడిన
తల్లిదండ్రులు:
ఈనెల 8వ తేదీ కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి సుమారు మూడేళ్ల వయస్సున్న లక్షిత్ అనే బాలుడు అదృశ్యమై 10వ తేదీ సూరేపల్లి సమీపంలోని పంట పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై విచారణ చేసిన ఉన్నతాధికారులు సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించేశారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలంటే భయపడుతున్నారు. కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
అరకొర వసతులతో కేంద్రాల నిర్వహణ
జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణాలు
శిథిలావస్థ భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంటున్న చిన్నారులు
లింగోజిపల్లిలో బాలుడి అనుమానాస్పద మృతి ఘటనతో తల్లిదండ్రుల ఆందోళన
పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలంటే జంకుతున్న వైనం
గతంలో నిలిచిపోయిన నిర్మాణాలకు మోక్షమెప్పడు?
జిల్లాలో 2903 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1127 చోట్ల మాత్రమే సొంత భవనాలుండగా 643 అద్దె రహిత భవనాలు, 1133 చోట్ల అద్దె భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల క్రితం అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టి చివరి దశకు చేరుకొని ఆ తర్వాత నిర్మాణాలు నిలిచిపోయిన భవనాలు నేటికీ అలాగే నిరుపయోగంగా పడి ఉన్నాయి. 90 శాతం నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భవనాల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

అంగన్‌వాడీలా..