
మెడికల్ షాపుల్లో డ్రగ్, విజిలెన్స్ అధికారుల తనిఖీలు
● జనరిక్ మందులు ఎమ్మార్పీకి విక్రయిస్తున్నట్లు గుర్తింపు
మార్కాపురం: జిల్లాలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు చెందిన ఆస్పత్రుల్లోని మెడికల్ షాపులతో సహా మొత్తం 16 మెడికల్ షాపులను ప్రకాశం, గుంటూరు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన 8 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో మూడు బృందాలు మంగళవారం తనిఖీ చేశాయి. ఈనెల 18న ‘సాక్షి’లో ‘‘మందుబిళ్ల ...జేబుగుల్ల’’ శీర్షికన వార్త ప్రచురితమైంది. తక్కువ ధరకు విక్రయించాల్సిన జనరిక్ మందులను ఎమ్‌ఆర్‌పీకే విక్రయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన డ్రగ్, విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. మార్కాపురం, ఒంగోలు, కనిగిరి ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపుల్లో తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో 12 ఔషధ నమూనాలు సేకరించారు. వాటిని ప్రభుత్వ ఔషధ పరీక్ష ప్రయోగశాలకి పంపించి పరీక్షించనున్నారు. ఔషధ నియంత్రణ శాఖ అడిషనల్ డైరెక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో మార్కాపురం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉషారాణి, గుంటూరు విజిలెన్స్ అధికారి సాంబశివరావు, మహేష్ తదితరులు ఉన్నారు. జనరిక్ మందులకు వస్తున్న తగ్గింపును వినియోగదారులకు ఇవ్వకుండా ఎమ్‌ఆర్‌పీకే విక్రయిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.

మెడికల్ షాపుల్లో డ్రగ్, విజిలెన్స్ అధికారుల తనిఖీలు