
కూటమి పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ
కనిగిరిరూరల్: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఆ ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు విద్యను దూరం చేసే జీఓ నంబర్ 77ను తక్షణ రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. పాలకులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. కనిగిరిలో ఎస్సీ 2 బాలుర హాస్టల్‌ను మూసి వేయాలని దుర్మార్గపు ఆలోచనను అధికారులు తక్షణం విరమించుకోవాలన్నారు. ఎస్సీ– 2 హాస్టల్‌ను కనిగిరిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ అధికారులకు అందచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు సాధిక్ బాబు, కార్తీక్, శివకుమార్, రంజిత్, క్రాంతి, నియోజకవర్గ నాయకులు ఎస్‌కే తాహిద్‌బాషా, సయ్యద్ ఇఫ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా