
కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు
గిద్దలూరు రూరల్: కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని విఠాసుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముందుగా సమావేశంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా పార్టీ అండగా నిలబడుతుందన్నారు. కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ మనుగడలో ఉండలేదన్నారు. అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం జగనన్న ప్రత్యేక దృష్టి సారించాడన్నారు. ఒక్క సారి జగనన్న మాట ఇచ్చాడంటే దానికి ఎంతగా కట్టుబడి ఉంటాడో ప్రజలందరికీ తెలుసన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగేలా అహర్నిశలు శ్రమించిన ఏకై క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు అబద్ధాల హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన తరువాత సూపర్ సిక్స్ హామీలనే అమలు చేయలేకపోతున్నాడని విమర్శించారు. ఇటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరని అన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత బస్సు అని చెప్పి అధికారం చేపట్టిన తరువాత కేవలం జిల్లాకు మాత్రమే పరిమితం అని చెబుతున్నాడన్నారు. అబద్ధపు హామీలు ఇవ్వకపోవడం వల్లే జగనన్న అధికారంలోకి రాలేకపోయాడన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ చంద్రబాబునాయుడు పగటి కలలు కంటున్నాడని, అది వారి తరం కాదన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న మహానేత వారసుడు జగనన్నను ప్రజలు ఎప్పటికీ దూరం చేసుకోలేరన్నారు. అబద్ధాల హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రవేశం లేదని పోలీసు స్టేషన్‌లల్లో బోర్డులు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్రమ కేసులు బనాయించి పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. మిర్చి, పత్తి, పొగాకు రైతులకు అండగా నిలబడి వారి తరఫున పోరాడే ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారా అధికారం చేపట్టిన తరువాత రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మండిపడ్డారు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపాలో ఒక జాబితాను సిద్ధం చేసుకుని పాలన కొనసాగిస్తున్నారన్నారు. పోలీసులను టీడీపీ కార్యకర్తల్లా ఉపయోగించుకుంటున్నారన్నారు. మహిళా నాయకుల పై దౌర్జన్యాలకు పాల్పడుతూ విధ్వంస పాలన చేస్తున్నారని విమర్శించారు. జగనన్న తిరిగి అధికారంలోకి రాగానే ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ గుర్తుపెట్టుకుని వారికి తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.
అక్రమ కేసులకు భయపడద్దు:
అక్రమ కేసులకు భయపడకుండా మొండి ధైర్యంతో ముందుకు సాగుదామని గిద్దలూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ అమలవుతోందన్నారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయడం లేదన్నారు. పొదిలిలో పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిందన్నారు. అందులో భాగంగానే అర్థవీడు, గిద్దలూరు, కంభం మండలాల్లో కొందరు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు.
జగనన్నను తిరిగి
ముఖ్యమంత్రి చేసుకుందాం..
రాబోయే ఎన్నికల్లో జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిగా, కె.పి.నాగార్జునరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లల్లో నగదు జమయ్యేలా చేసి ఎక్కడా అవినీతి లేని పాలన కొనసాగించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 2 వేల వ్యాధులను బాగు చేసుకునే అవకాశం కల్పించాడన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామంలోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడని చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మోసాలతో పాటుగా అబద్ధాల హామీలను తెలియజేసే క్యూఆర్ కోడ్ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు, కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు, రాచర్ల ఎంపీపీలు కడప లక్ష్మీ, చేగిరెడ్డి తులసమ్మ, ఓసూరారెడ్డి, వెంకట్రావు, షేక్.ఖాశీంబీ, బేస్తవారిపేట, కొమరోలు, జెడ్పీటీసీలు వెంకటరాజయ్య, సారె వెంకటనాయుడు, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, రవికుమార్ యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఆర్‌ఐ మురళి, పగడాల శ్రీరంగం, మానం బాలిరెడ్డి, మండల కన్వీనర్‌లు బత్తిని ఓబులరావు, ఏరువా రంగారెడ్డి, గోడి వెంకటేశ్వరరెడ్డి, చేరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి,జింకా రమేష్‌యాదవ్, డా.భూమా నరసింహారెడ్డి, బొర్రా క్రిష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేస్తాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు

కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు