
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు వన్‌టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డీ జయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత గురుకులాల్లో దరఖాస్తులను విద్యార్థులు సమర్పించాలన్నారు. దరఖాస్తులు సమర్పించే విద్యార్థినీ, విద్యార్థులు 10వ తరగతిలో ప్రవేశాలకు 9వ తరగతిలో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు పొందగోరే వారు మొదటి సంవత్సరంలో 50 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలని చెప్పారు. కుల ప్రాతిపదికన రోస్టర్ విధానంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారన్నారు. ఈ నెల 16వ తేదీలోపు సంబంధిత పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందన్నారు.
మద్యం బాటిళ్లు పట్టివేత
● ముగ్గురిపై బైండోవర్ కేసులు నమోదు
బేస్తవారిపేట: మండలంలోని పాత మల్లాపురం, శింగరపల్లెలో బెల్ట్‌షాపులపై కంభం ప్రొహిబిషన్–ఎకై ్సజ్‌శాఖ సీఐ కొండారెడ్డి తనిఖీలు నిర్వహించారు. సోమవారం సాక్షిలో ‘ఊరూరా ఎల్లో బెల్ట్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. పాత మల్లాపురంలో 15 మద్యం క్వార్టర్ బాటిళ్లు కలిగిన కే దాయదును పట్టుకున్నారు. శింగరపల్లెలో పేరయ్య, గోవిందరెడ్డిలను అదుపులోకి తీసుకుని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయించారు.
యువతను మోసం చేస్తే ఊరుకునేది లేదు
● కూటమి ప్రభుత్వానికి ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ హెచ్చరిక
ఒంగోలు టౌన్: గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యార్థులు, యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఏడాది పాలన పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ప్రభాకర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని, అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలని, 26 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఆర్.కరుణానిధి మాట్లాడుతూ కనిగిరి నిమ్జ్, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.రాంబాబు, గోపి, మత్తయ్య, శాంబాబు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.