
రాజీకీయాలు!
కబ్జా తమ్ముళ్లు ..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు ఎడాపెడా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అది ప్రభుత్వ, ప్రైవేటు భూమా అన్న తేడా లేకుండా భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ఈ బెడద ఎక్కువగా ఉంది. ఏడాది కాలంలోనే ఒంగోలు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఐదు భూ వివాదాలను పరిష్కరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన ఒక భూ వివాదానికి సంబంధించిన పరిష్కారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేత నేరుగా రంగంలోకి దిగి పంచాయితీలు చేస్తుండడంతో కింది స్థాయి నాయకులు సైతం బరితెగిస్తున్నారు. పచ్చ గద్దల భూ మాయాజాలాన్ని చూసి నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
శివారు భూ వివాదంలో..
నగర శివారులోని ఓ భూమిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు సమాచారం. టీడీపీ కీలక నేత సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. దీంతో ఆస్థలం కొనుగోలు చేసిన వ్యక్తి సదరు నేతకు ఎకరం భూమి గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కేసులో కొంత మంది పోలీసు అధికారులకు సైతం పెద్ద ఎత్తున తాయిలాలు అందినట్టు సమాచారం.
ఉర్దూ స్కూలును పడగొట్టి:
పాత మార్కెట్ సమీపంలోనే ఉర్దూ స్కూలును 1938లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదేళ్లుగా ఈ స్కూలు శిథిలావస్థకు చేరుకుంది. దీని విస్తీర్ణం 23 సెంట్లు కాగా ఇక్కడ గది రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది. రూ.35 కోట్లకు పైగా విలువ చేసే ఉర్దూ స్కూలు భూమి మీద కన్నేసిన పచ్చదండు ఎలాగైనా సరే కబ్జా చేసేందుకు పావులు కదిపారు. ఉర్దూ స్కూలును నేలమట్టం చేసేందుకు మే 2వ తేదీ జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. జూలై 1వ తేదీ గుట్టుచప్పుడు కాకుండా ఉర్దూ స్కూలును నేలమట్టం చేశారు. ఇక్కడ టీడీపీకి చెందిన ఒక వ్యాపారవేత్త పెట్రోలు బంకు ఏర్పాటుకు యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లీజు పేరుతో తక్కువ ధరకే ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ముక్తినూతలపాడు భూ కబ్జాకు ప్రయత్నం...
నగర శివారులోని ముక్తినూతలపాడు పంచాయతీ సర్వే నంబర్ 15లో 21.60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కీలక నేత అనుచరులు ప్రయత్నించడం వివాదంగా మారింది. ఈ భూమిలో 5.60 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించారు. మార్కెట్లో దీని విలువ ఎకరం రూ.6 కోట్లు పైగానే ఉంది. 5.60 ఎకరాలు అంటే స్థలం విలువ సుమారు రూ.36 కోట్లు పైమాటే. కీలక నేత అండదండలతో ఒంగోలు కమ్మపాలేనికి చెందిన ఒక టీడీపీ నాయకుడు, ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు కలిసి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి రికార్డుల్లో కుంట భూమిగా నమోదై ఉంది. దీనిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి స్థలాల కింద పంపిణీ చేయాలని జాన్ ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. కబ్జాకు గురైన స్థలాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఈ భూమిని కాపాడాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలోని దత్తాత్రేయ కాలనీ ఎదురుగా ఉన్న 1.36 ఎకరాల అసైన్‌మెంట్ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసి అమ్మకాలు చేపట్టడం విమర్శల పాలైంది. ఈ భూమి విలువ సుమారుగా రూ.5 కోట్లకు పైగానే ఉంది. దీనిలో ప్లాట్లు వేసి పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపట్టడం పచ్చదండు బరితెగింపునకు నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. కేశవరాజు కుంట వద్ద సర్వే నంబర్ 81లోని ప్రభుత్వ స్థలాన్ని సైతం పచ్చ మాఫియా కబ్జా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.వంద కోట్ల ప్రభుత్వ భూమిపై కన్ను...
నగరం నడిబొడ్డున పాత కూరగాయల మార్కెట్ వద్ద 83 సెంట్ల ప్రభుత్వ స్థలంపై టీడీపీ యువనేత ఒకరు కన్నేశారు. 15 సెంట్ల స్థలానికి నగర పాలక సంస్థ నుంచి తాత్కాలిక ఒప్పందం మీద అనుమతులు తీసుకున్నారు. నగర పాలక సంస్థ ఇచ్చిన అనుమతుల ప్రకారం ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు నిర్మించడానికి వీలులేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ స్థాయిలో కట్టడాలు చేస్తున్నారు. ఇక్కడ గది రూ.25 లక్షల వరకు ఉంది. ఆ లెక్కన చూస్తే ఈ భూమి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇంత ఖరీదైన స్థలాన్ని దొడ్డిదారిన కాజేయడానికి పక్కా ప్రణాళికతోనే నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.