
బడిలో అవినీతి బాగోతం
మార్కాపురం టౌన్:
మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంట్ నిర్వహణ, మధ్యాహ్న భోజనం నిర్వహణలో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుతీరుపై పరిశీలించేందుకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ రాగా అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటకు వచ్చాయి. రికార్డులు పరిశీలించగా రిజిస్టరులో నమోదు చేసిన బియ్యానికి, వంట మనుషుల వద్ద ఉన్న బియ్యానికి తేడా రావడంతో హెచ్‌ఎం శ్రీదేవిని ప్రశ్నించారు. దీంతో ఆమె హడావుడిగా రిజిస్టర్లను దిద్దటానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాను పిలిపించి జరుగుతున్న అక్రమాలను వెల్లడించారు. పాఠశాలలో సుమారు 802 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమైన సుమారు 120 కిలోల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 70 కిలోలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కోడిగుడ్లు కూడా సక్రమంగా అందించకుండా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారన్నారు. విద్యార్థులకు అవసరమైన మంచినీటి కోసం పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంటును ఏర్పాటు చేశారు. అయితే గతేడాది ప్రభుత్వం నిర్వహణ నిమిత్తం లక్ష రూపాయలు మంజూరు చేయగా కేవలం రూ.10 వేలు ఖర్చుపెట్టి రూ.90 వేలు తన సొంతానికి వాడుకున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన మెనూ రికార్డులను తనముందే తారుమారు చేస్తున్నట్లు గుర్తించారన్నారు. రికార్డులకు సంబంధించిన రిజిస్టరును విలేకరుల ఎదుట చూపారు. పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి వారికి కావాల్సిన టీసీలు, మార్కు లిస్టులు తదితరాలు ఇచ్చేందుకు రూ.500 వసూలు చేస్తున్నారని తెలిపారు. హెచ్‌ఎం శ్రీదేవిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్, సబ్‌కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు.
సబ్‌కలెక్టర్ విచారణ:
జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాకమిటీ చైర్మన్ ఆరోపణలపై మార్కాపురం సబ్‌కలెక్టర్ త్రివినాగ్, తహశీల్దార్ చిరంజీవి పాఠశాలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తహశీల్దార్ తెలిపారు.
బట్టబయలు చేసిన పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఆర్‌ఓ ప్లాంటు మరమ్మతుల పేరుతో రూ.90 వేలు స్వాహా బియ్యం పంపిణీలో చేతివాటం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థినులు సబ్‌కలెక్టర్ విచారణ

బడిలో అవినీతి బాగోతం