
రూ.100 కోట్ల భూమి అన్యాక్రాంతం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద దాదాపు రూ.100 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం అయిందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ షేక్ ఇమ్రాన్ ఖాన్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమానికి ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, కార్పొరేటర్లు జి.ప్రవీణ్ కుమార్, వెన్నపూస కుమారి, కో–ఆప్షన్ సభ్యులు రషీదా, శ్యామ్ సాగర్‌లు ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను కలిశారు. పాత మార్కెట్ స్థలం అన్యాక్రాంతంపై ఈ ఏడాది జూన్ 29న సాక్షిలో శ్రీభూదందాశ్రీ శీర్షికతో కథనం ప్రచురితమైందని ఆ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా అందజేశారు. ఆ విషయమై విచారించామని సుమారుగా రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని నిర్ధారించినట్లు వివరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులను వాటికి సంబంధించిన లీజు ప్రక్రియ ఆధారాలు అడిగినా సరైన సమాధానం చెప్పలేదన్నారు. ఈ భూమిని అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడుకి తాత్కాలిక లీజుకు ఇచ్చినట్లు తెలిపిందన్నారు. రోడ్డు మార్జిన్‌లో తాత్కాలికంగా పందిళ్లు, చలువ పందిళ్లు, రేకుల గుడారాలు వేసుకునేందుకు టౌన్ ప్లానింగ్ వారు ఒక వారానికి పరిమితంగా 10 చదరపు మీటర్లకు రూ.100 లు చొప్పున రుసుము వసూలు చేయటానికి సంబంధించిన సాధారణ అనుమతి మాత్రమే ఇచ్చారన్నారు. సర్వే నం.77, బ్లాకు నం.4, వార్డు నం.3లో 83 సెంట్ల స్థలంలో సంవత్సరం లీజుకు తాత్కాలిక అనుమతులు ఇస్తే దాదాపు రూ.25 లక్షలకు పైగా వెచ్చించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని ఇన్‌చార్జ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి తీర్మానం చేయకుండానే టీడీపీ నాయకులకు మేలు చేసేలా అధికారులు తెగబడ్డారన్నారు. సాధారణ ఓపెన్ ఆక్షన్, టెండర్ జరిపితే దాదాపుగా ఈ స్థలానికి రూ.5 లక్షలు ప్రతినెలా అద్దె లీజు రూపంలో నగరపాలక సంస్థకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. కానీ కేవలం రూ.33,600 ఒక సంవత్సరం పాటు లీజుకు ఇవ్వటం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఈ స్థలాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్సుగా మార్చి అభివృద్ధి చేయాలని యత్నించి డిజైన్ల కోసం సీబీఆర్‌ఈ అనే సంస్థకు పంపారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రభుత్వానికి అనుమతి కోసం వెళ్లిందన్నారు. ఈ స్థలానికి సంబంధించిన తాత్కాలిక అనుమతులు తొలగించి ఒంగోలు నగరపాలక సంస్థ స్వాధీన పరచుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ సీరియస్ అయ్యారు. వెంటనే దీనిపై విచారణ కోసం ఒంగోలు తహశీల్దార్, నగర కమిషనర్, మున్సిపల్ సర్వేయర్‌తో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. మంగళవారం సాయంత్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
సాధారణ లీజు పొంది శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న అధికార పార్టీ నాయకులు వారితో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు కుమ్మక్కు మీ కోసంలో ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అన్యాక్రాంతంపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
రూ.కోట్ల విలువైన ఆస్తులు కబ్జాలకు ఆస్కారం
ఒంగోలు నగరంలోని రూ.కోట్ల విలువైన ఆస్తులను టీడీపీ కూటమి ప్రభుత్వం కబ్జాలకు ఆస్కారం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని పాత కూరగాయల మార్కెట్ స్థలం కబ్జాకు గురైందని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహించదన్నారు. ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం కావటాన్ని సహించేది లేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు.