
ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయండి
● ఇన్‌చార్జి కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, ప్రాజెక్టు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌హెచ్ 565, ఎన్‌హెచ్ 216, ఎన్‌హెచ్ 544, ఎన్‌హెచ్ 167బి, ఎన్‌హెచ్ 765, ఎన్‌హెచ్ 544జి, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పురోగతిపై అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ల్యాండ్ క్లెయిమ్స్, పెండింగ్ క్లెయిమ్స్‌ను పూర్తి చేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అవార్డులను పాస్ చేయాలన్నారు. రెవెన్యూ సంబంధిత ప్రాజెక్టుల అధికారులతో సమన్వయం చేసుకుని భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు.