న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి

Jul 12 2025 7:05 AM | Updated on Jul 12 2025 11:05 AM

న్యాయ

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి

?

కంభం:

మూడేళ్ల బాలుడు పొదిలి లక్షిత్‌ అనుమానస్పద మృతి కేసులో తమకు న్యాయం చేయాలంటూ కంభం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో కుటుంబ సభ్యులు, లింగోజిపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కంభం మండలం లింగోజిపల్లిలో మంగళవారం ఉదయం 11 గంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి అదృశ్యమైన లక్షిత్‌ గ్రామానికి 3 కి.మీ దూరంలో సూరేపల్లి శివార్లలో ఉన్న పంటపొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీయగా.. అడవిలో చిక్కుకున్న బాలుడు ఆహారం, నీరు లేక మృతి చెంది ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా పోలీస్‌ అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా చానళ్లు, దినపత్రికల్లో(సాక్షి కాదు) వార్తలొచ్చాయి. దీంతో ఆగ్రహించిన బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

ట్రాక్టర్లలో తరలివచ్చిన మహిళలు

బాలుడి మృతిపై న్యాయం జరగడం లేదని ఆగ్రహించిన మహిళలు, గ్రామస్తులు రెండు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలో వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాదించిన గ్రామస్తులు అక్కడి నుంచి కంభం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉండగా పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ చూస్తుంటే తమకు న్యాయం జరుగుతుందని అనిపించడం లేదని ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బాలుడిని ఎవరు ఎత్తుకెళ్లారో, ఎందుకు చంపారో విచారించి నిందితులను శిక్షించి మాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మా బాబు తప్పిపోలేదు.. ఎవరో ఎత్తుకెళ్లారు

తన కొడుకు లక్ష్మిత్‌ తప్పిపోలేదని ఎవరో పథకం ప్రకారం ఎత్తుకెళ్లి హత్య చేశారని తల్లి సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో కనిపెట్టాలని, సాధారణ మృతిగా మార్చేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘నా కొడుకు ఎలాగూ నాకు దక్కలేదు, ఇంకో తల్లికి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల’ని కోరారు. పెద్దవాళ్లే దిగి ఎక్కలేని వాగును చిన్న పిల్లాడు ఎలా దాటతాడని, కేసును తప్పు దోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే హంతకులు అక్కడ చెప్పులు పెట్టి ఉంటారని లక్షిత్‌ అమ్మమ్మ అనుమానం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ నిర్లక్ష్యంపై ఆగ్రహం

అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న ఐదుగురు పిల్లల్లో ఒక బాలుడు అదృశ్యమై మృతి చెందిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లవాడి మరణానికి పరోక్షంగా వారు కూడా కారకులని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

చిన్నారి లక్షిత్‌ మృతి కేసు దర్యాప్తుపై బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం

కంభం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట లింగోజిపల్లి వాసుల ఆందోళన

రెండు ట్రాక్టర్లలో వస్తున్న మహిళలకు మధ్యలోనే నచ్చజెప్పేందుకు పోలీసుల యత్నం

కేసు విచారణ కాకుండానే సాధారణ మృతి అని ఎలా చెబుతారని ఆగ్రహం

అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యంపై నిప్పులుచెరిగిన స్థానికులు

విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న సీఐ మల్లికార్జున

45 గంటల పాటు బాలుడు ఎక్కడున్నాడన్న దానిపై పలు అనుమాలు

బాలుడి కుటుంబానికి ‘అన్నా’ పరామర్శ

లింగోజిపల్లిలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి అదృశ్యమై పంట పొలాల్లో శవమై తేలిన బాలుడు పొదిలి లక్షిత్‌ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు శుక్రవారం పరామర్శించారు. తీరని వేదనతో కుమిలిపోతున్న లక్షిత్‌ తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అణ్యం పుణ్యం ఎరుగని బాలుడి అనుమానాస్పద మరణం తనను కలచివేసిందని, ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. ఆయన వెంట ఎల్‌కోట సర్పంచ్‌ బాషా, ఎంపీటీసీ రావూరి రవి, జగన్‌, బొల్లు రాములు ఉన్నారు.

45 గంటలపాటు బాలుడు ఏమయ్యాడు

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అదృశ్యమైన బాలుడు 45 గంటల తర్వాత విగతజీవిగా కనిపించాడు. లింగోజిపల్లి నుంచి సంఘటనా స్థలం ప్రాంతానికి చేరుకోవాలంటే మధ్యలో నల్లవాగు దాటాలి. ఈ నేపథ్యంలో బాలుడు ఒంటరిగా వెళ్లి ఉంటాడన్న వాదనను కొట్టిపడేస్తున్నారు. రెండో రోజు నల్లవాగు వద్ద బాలుడి చెప్పులు కనుగొన్న పోలీసులు చుట్టుపక్కల పంటపొలాలు, పరిసరాలను డ్రోన్‌ కెమెరాలతో జల్లెడ పట్టారు. డాగ్‌ స్క్వాడ్‌తోపాటు గ్రామస్తులు ఆ ప్రాంతంలో అడుగడుగూ తిరిగినా ఆచూకీ లభించలేదు. బాలుడి మృతదేహం లభ్యమైన ప్రదేశంలో ముందురోజు ఏమీ కనబడలేదు. బాలుడు తప్పిపోయిన మొదటి రాజు రాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. బాలుడు నిజంగా తప్పిపోయి వచ్చి ఉంటే ఆ వర్షంలో ఎక్కడ ఉన్నాడు?, రెండు రాత్రులు ఎలా గడిచాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బాలుడు అదృశ్యమైన కొంత సమయానికే పోలీసులు, గ్రామస్తులు చుట్టుముట్టడంతో కిడ్నాపర్లే అంతమొందించి ఉంటారన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

కేసు దర్యాప్తు కొనసాగుతోంది

ఒంగోలు జీజీహెచ్‌కు చెందిన ప్రొఫెసర్‌తో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే సహజ మరణమా లేక బలవన్మరణమా అనే విషయం తెలుస్తుంది. బాలుడి అనుమానాస్పద మృతి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. దర్యాప్తు పూర్తయితే వివరాలు వెల్లడిస్తాం.

– మల్లికార్జునరావు, కంభం సీఐ

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి 1
1/4

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి 2
2/4

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి 3
3/4

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి 4
4/4

న్యాయం కావాలి.. నిందితులను శిక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement