
విద్యుదాఘాతంతో రైతు మృతి
రాచర్ల: వ్యవసాయ బోరు స్టార్టర్ బాక్స్ వద్ద ఫ్యూజులు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురైన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రాచర్ల మండలంలోని ఒద్దులవాగుపల్లె గ్రామ వ్యవసాయ పొలాల్లో శుక్రవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నపురెడ్డి రామ్‌భూపాల్‌రెడ్డి(61) ఒద్దులవాగుపల్లె–సత్యవోలు మార్గంలో ఉన్న తన పొలంలో 10 రోజుల క్రితం మొక్కజొన్న సాగు చేశారు. మొలక దశలో ఉన్న పంటను అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మైకు ఏర్పాటు చేసి ఇంటికి వచ్చారు. మైకును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు శుక్రవారం వేకువజామున బైక్‌పై పొలానికి వెళ్లారు. డీప్‌బోర్ స్టార్టర్ బాక్స్ ఫ్యూజులు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. రామ్‌భూపాల్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య లక్ష్మీదేవి పొలం వద్దకు వెళ్లి చూసింది. విగతజీవిగా పడి ఉన్న రామ్‌భూపాల్‌రెడ్డిని చూసి బోరున విలపిస్తూ బంధువులకు సమాచారమిచ్చింది. ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
రైల్వే స్టేషన్లో పోలీసుల
ఆకస్మిక తనిఖీలు
ఒంగోలు టౌన్: గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఒంగోలులో శుక్రవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈగిల్ టీం, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతోపాటుగా పోలీసు డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలు, రైలు బోగీలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ సర్వీసు సెంటర్లో అనుమాస్పదంగా కనిపించిన ప్రతి పార్సిల్‌ను పరిశీలించారు. ఒంగోలు మీంచి వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లోని బోగీలలో ఎక్కి అనువణువు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరంలోని అన్నీ ప్రధాన కూడళ్లతో పాటుగా రైల్వే స్టేషన్లోనూ తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 11972, స్థానిక పోలీసులు, డయల్ 112 , పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలో మహిళా పీఎస్ సీఐ సుధాకర్, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్, ఆర్పీఎఫ్ సీఐ కొండయ్య, ఈగల్ టీం, ఎస్సైలు పాల్గొన్నారు.
టంగుటూరులో
దొంగలు హల్‌చల్
● 4 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ
టంగుటూరు: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన టంగుటూరు పురం సెంటర్లో గురువారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. స్థానిక పురం సెంటర్లో నివాసం ఉండే బడుగు దీనదాసు కుటుంబ సభ్యులు నిమ్మకూరు గ్రామంలో చదువుతున్న కూతురు వద్దకు ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి ఇంటికి వచ్చారు. తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. దుండగులు బీరువా పగలగొట్టి సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య, ఎస్సై నాగమల్లీశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి