
12, 13న బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఒంగోలు: ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేఎస్ లక్ష్మణ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11,13,15,17,19 విభాగాల బాలబాలికలతోపాటు సీనియర్ మహిళలు, పురుషుల విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్‌కార్డు, వయసు ధ్రువీకరణ పత్రంతో ఈనెల 10వ తేదీలోగా 9398260109ను సంప్రదించాలని సూచించారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మార్కాపురంలో ఇద్దరు యువకుల ఆత్మహత్య
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ యువకుడు ఉరేసుకుని తనువు చాలించగా, మరో యువకుడు పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మరణించాడు. పట్టణ ఎస్సై సైదుబాబు కథనం మేరకు.. పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన వెన్నం రాంబాబు(24) తన కుటుంబ సభ్యులతో కలిసి మార్కాపురంలోని జవహర్‌నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన తండ్రి ఒక అపార్టుమెంటులో వాచ్‌మెన్. కుటుంబ సమస్యల నేపథ్యంలో గురువారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడి అన్న దశరథరాముడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● మార్కాపురం జవహర్‌నగర్ కాలనీలో నివాసముండే నూతలపాటి చెన్నకేశవులు(30) కుటుంబ సమస్యల కారణంగా శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య ఆగ్నేషా, కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు ఉన్నత చదువు చదివాడు. ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇద్దరు యువకుల మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.